సోమవారం, 2 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 2 మే 2021 (19:45 IST)

నాలుగు దశాబ్దాల చరిత్రను తిరగరాసిన ఎల్డీఎఫ్

కేరళ రాష్ట్రంలో ఎల్డీఎఫ్ చరిత్రను తిరగరాసింది. ముఖ్యమంత్రి పినరయి విజయ్ అద్భుత పాలనకు ఆ రాష్ట్ర ప్రజలు మరోమారు పట్టంకట్టారు. దీంతో 40 యేళ్ళ తర్వాత ఎల్డీఎఫ్ అధికారంలోకి వచ్చింది. 
 
నిజానికి ప్రతి ఐదేళ్ళకోసారి ఎల్డీఎఫ్‌, యూడీఎఫ్ కూటములు అధికారంలోకి వస్తుంటాయి. ఇక్కడి ప్రజలు మార్పును కోరుకుంటుంటారు. కానీ, ఈ దఫా తన ఆనవాయితీని పక్కనబెట్టి తిరిగి ఎల్డీఎఫ్‌కే పట్టంకట్టారు. 
 
ప్రతి ఐదేండ్లకు ఒకసారి ప్రభుత్వాన్ని మార్చే సంప్రదాయానికి ఈసారి తెరదించారు. 1980 నుంచి కేరళలో ప్రతి ఐదేండ్లకు ఒకసారి అధికార మార్పిడి జరుగుతూనే ఉంది. అయితే, ప్రస్తుతం ఈ సంప్రదాయానికి మలయాళీలు స్వస్తి పలికినట్లు ప్రస్తుత ఎన్నికల సరళిని బట్టి తెలుస్తున్నది.
 
లోక్‌సభ ఎన్నికల్లో ఎల్డీఎఫ్ కూటమి ఘోర పరాజయం మూటగట్టుకున్నా.. అసెంబ్లీ ఎన్నికలకు మాత్రం పరిస్థితి పూర్తిగా మారిపోయింది. కేరళలో కరోనా కట్టడికి విజయన్ ప్రభుత్వం అనుసరించిన వ్యూహం మోడల్‌గా నిలిచింది. ఈ ఎన్నికల్లో ఎల్డీఎఫ్ విజయానికి ముఖ్యమంత్రి విజయన్ చరిష్మా ప్రధాన కారణంగా నిలిచిందని వామపక్ష కార్యకర్తలు బాహాటంగా చెప్తుంటారు. 
 
కేరళలో రాజకీయ ప్రకంపనలు రేపిన బంగారం అక్రమ రవాణా కుంభకోణంలో అరెస్టులు, సోదాలు.. విజయన్ ప్రభుత్వంపై ఏ మాత్రం ప్రభావం చూపలేదని తాజా ఫలితాలతో రుజువైంది. 
 
కాగా, దేశంలో తొలి కమ్యూనిష్టు ప్రభుత్వం కేరళలో ఏర్పడింది. 1957లో వామపక్ష ప్రభుత్వం ఏర్పడగా.. ఈఎంఎస్ నంబూద్రిపాద్ కేరళ సీఎంగా ఎన్నికయ్యారు. 1960లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. 1965 ఎన్నికల్లో తిరిగి వామపక్షాలు విజయం సాధించి అధికారం చేపట్టాయి. ఆ తర్వాత 1970 నుంచి కాంగ్రెస్ కూటమిలోని ప్రభుత్వాలు అధికారంలో ఉన్నాయి. 
 
1980లో సీపీఎం అధికారాన్ని చేపట్టింది. ఆ తర్వాత నుంచి ప్రతి ఐదేండ్లకూ జరిగే ఎన్నికల్లో అధికార మార్పిడి జరుగుతూ వస్తున్నది. అయితే, ప్రస్తుతం ఈ పరంపరను పినరయి విజయన్ అధిగమించి కొత్త చరిత్రను లిఖించారు.
 
2006లో మరోసారి సీపీఎం అధికారాన్ని చేజిక్కించుకుంది. అప్పటి నుంచి పూర్తికాలం పాటు వీఎస్ అచ్యుతానందన్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. 2011 ఎన్నికల్లో సీపీఎం నేతృత్వంలోని ఎల్డీఎఫ్ అధికారాన్ని చేజిక్కించుకోవడానికి రెండు, మూడు సీట్ల దూరంలో ఉండిపోగా.. 2011 నుండి 2016 వరకు యూడీఎప్ కేరళలో మళ్లీ అధికారంలోకి వచ్చింది. 
 
2016లో జరిగిన ఎన్నికల్లో సీపీఎం విజయం సాధించింది. అయితే, ఈసారి అచ్యుతానందన్‌ను పక్కనబెట్టిన పార్టీ పెద్దలు.. పినరయి విజయన్‌ను సీఎంగా ఎంపిక చేశారు. కేరళ వరదలు, కరోనా సంక్షోభంలో ఆయన పనితీరు పట్ల ప్రజల్లో సంతృప్తి వ్యక్తమయ్యింది. అందుకు ఈ ఎన్నికల్లో ఘన విజయమే నిదర్శనం.
 
కేరళ ముఖ్యమంత్రిగా ఉన్న పినరయి విజయన్‌ ప్రజల్లో ఎంతో పేరు గడించారు. ఇటీవల ఏబీపీ-సీఓటర్‌ నిర్వహించిన సర్వేలో విజయన్‌ పట్ల ప్రజలు ఎంత మేర సంతృప్తికరంగా ఉన్నారనేది తేలింది. రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన సర్వేలో పాల్గొన్నవారిలో దాదాపు 48 శాతం మంది విజయన్‌ పనితీరు అద్భుతంగా ఉన్నదని పేర్కొన్నారు. 
 
కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటు వేసిన అనంతరం పినరయి విజయన్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎల్డీఎఫ్‌కు అయ్యప్పస్వామి దీవెనలు ఉన్నాయని చెప్పారు. అయ్యప్పతోపాటు ఈ నేలపై ఉన్న ఇతర మత విశ్వాసాలకు చెందిన దేవుళ్లు కూడా తమ ప్రభుత్వాన్ని దీవిస్తారని పినరయి అన్నారు. 
 
తమ ప్రభుత్వం ప్రజలను రక్షిస్తున్నందున.. దేవుడు తమ పార్టీని రక్షిస్తాడని, అన్ని మతాల దేవుళ్ల దీవెనలతో మరోసారి అధికారంలోకి వస్తాం అని విశ్వాసం వ్యక్తం చేశారు. అదేవిధంగానే ఎల్డీఎఫ్ విజయభేరీ మోగించింది.