బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By వరుణ్
Last Updated : శుక్రవారం, 14 ఏప్రియల్ 2023 (09:07 IST)

కర్నాటక అసెంబ్లీ ఎన్నికలు : బరిలో కేజీఎఫ్ బాబు భార్య

kgf babu wife
కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లో కేజీఎఫ్ వాసి యూసుఫ్ షరీఫ్ అలియాస్ కేజీఎఫ్ బాబు తన భార్య షాజియా తరునంను బరిలోకి దించారు. బెంగుళూరు సెంట్రల్ చిక్కిపేట అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఆమె స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయనున్నారు. ఇందుకోసం ఆమె గురువారం నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. తన భర్త బాబు, కుమార్తెతో కలిసి తరునం గురువారం నామినేషన్ పత్రాలను ఎన్నికల రిటర్నింగ్ అధికారికి సమర్పించారు. 
 
కాగా, కర్నాటక రాష్ట్రంలోని కోటీశ్వరుల్లో కేజీఎఫ్ బాబు ఒకరు. ఈయన గుజిరీ వ్యాపారాన్ని ప్రారంభించి రూ.కోట్లకు పడగలెత్తిన ఆయన.. కేజీఎఫ్ బాబుగా ప్రజల్లో గుర్తింపుపొందారు. ఇటీవలే కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెండ్‌కు గురైన ఆయన... ఇపుడు తన భార్యను స్వతంత్ర అభ్యర్థిగా పోటీలోకి దించారు. కేజీఎఫ్ బాబు కూడా రెండేళ్ల క్రితం బెంగుళూరు నుంచి ఆ పార్టీ తరపున పోటీ చేసిన ఓటమి పాలయ్యారు. 
 
ఆ సమయంలో ఆయన ప్రకటించిన తన ఆస్తుల విలువ రూ.1743 కంటే రెట్టింపు ఆస్తులను ఆయన కలిగివున్నారంటూ అధికార బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. అయితే, ఈదఫా చిక్కపేట అసెంబ్లీ నుంచి తనకు పోటీ చేసేందుకు అవకాశం ఇవ్వాలని ఆయన కాంగ్రెస్ నేతలను కోరుతూ వచ్చారు. కానీ, అలాంటి అవకాశం ఇవ్వకపోగా, పార్టీ నేతల్లో నెలకొన్న విభేదాలను పరిష్కరించే నిమిత్తం ఏకంగా ఆయనపై సస్పెండ్ వేటు వేశారు.