మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By selvi
Last Updated : గురువారం, 16 ఆగస్టు 2018 (17:55 IST)

#AtalBihariVaajpayee బీజేపీ కురువృద్ధుడు.. అటల్ బిహారీ వాజ్‌పేయి కన్నుమూత

బీజేపీ కురువృద్ధుడు, మూడుసార్లు ప్రధానిగా దేశానికి సేవలు అందించిన అటల్ బిహారీ వాజ్‌పేయి కన్నుమూశారు. మాజీ ప్రధాని అయిన శ్రీ అటల్ బిహారీ వాజ్ పేయి గురువారం సాయంత్రం 05.05 గంటలకు తుదిశ్వాస విడిచారని ఎయి

బీజేపీ కురువృద్ధుడు, మూడుసార్లు ప్రధానిగా దేశానికి సేవలు అందించిన అటల్ బిహారీ వాజ్‌పేయి కన్నుమూశారు. మాజీ ప్రధాని అయిన శ్రీ అటల్ బిహారీ వాజ్ పేయి గురువారం సాయంత్రం 05.05 గంటలకు తుదిశ్వాస విడిచారని ఎయిమ్స్ విడుదల చేసిన ప్రకటనలో ధ్రువీకరించింది.


ఈ నెల 11వ తేదీన ఎయిమ్స్‌లో చికిత్స కోసం చేరిన వాజ్‌పేయికి 9 వారాల పాటు చికిత్స అందించామని, ఆయన ఆరోగ్యం నిలకడగా వుండిందని.. కానీ గడిచిన 36 గంటల్లో వాజ్‌పేయి ఆరోగ్యం అత్యంత విషమంగా మారిందని వైద్యులు తెలిపారు. 
 
వాజ్‌పేయికి ఎయిమ్స్ వైద్యులు మెరుగైన చికిత్స అందించి.. ఆయన ప్రాణాలు కాపాడేందుకు తీవ్రంగా శ్రమించారని.. కానీ వాజ్‌పేయి తిరిగి రాని లోకాలకు వెళ్ళిపోయారని ఎయిమ్స్ ప్రకటించింది. వాజ్‌పేయి మృతిపట్ల బీజేపీ అగ్రనేతలు దిగ్భ్రాంతికి గురైయ్యారు. వాజ్‌పేయి మృతి పట్ల ప్రముఖులు ప్రగాఢ సంతాపం వ్యక్తం చేస్తున్నారు. 
 
కాగా, భారతీయ జనసంఘ్, భారతీయ జనతా పార్టీల వ్యవస్థాపకుల్లో ఒకరైన వాజ్‌పేయి.. ఐదేళ్లు పూర్తికాలం పరిపాలన సాగించిన తొలి కాంగ్రెసేతర ప్రధానిగా ఆయన రికార్డు సృష్టించారు. ఉత్తమ పార్లమెంటేరియన్‌గా పురస్కారం అందుకున్న వాజ్‌పేయిని కేంద్ర ప్రభుత్వం 2015లో భారతరత్న పురస్కారం ఇచ్చి గౌరవించింది.
 
అటల్ బిహారీ వాజ్‌పేయి ఆరోగ్యం క్షీణించడంతోనే బీజేపీ నేతలు తమ కార్యక్రమాలను రద్దు చేసుకుంటున్నారు. ఈ నెల 18,19 తేదీల్లో జరగాల్సిన నేషనల్ ఎగ్జిక్యూటివ్ మీటింగ్‌ను రద్దు చేశారు. ఆగస్ట్ 15 సందర్భంగా బీజేపీ కేంద్ర కార్యాలయంలో చేసిన అలంకరణను తొలగించారు.
 
ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు, వాజ్‌పేయి సహచరుడు, కుడిభుజం లాంటి ఎల్కే అద్వానీ, కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్, పలువురు కేంద్రమంత్రులు ఎయిమ్స్‌లో వాజ్‌పేయిని కడసారి సందర్శించారు. ప్రధాని మోదీ వాజ్‌పేయిని ఆస్పత్రిలో సందర్శించారు. 93 ఏళ్ల వాజ్‌పేయి జూన్ 11 నుంచి ఎయిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందారు. మూత్రనాళ సంబంధిత సమస్యతో ఆయన ఇబ్బంది పడ్డారు.