బుధవారం, 27 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 11 ఆగస్టు 2021 (05:44 IST)

ఓబీసీ బిల్లుకు లోక్‌సభ ఆమోదం.. విపక్షాలన్నీ మద్దతు

లోక్‌సభలో మరో కీలక బిల్లు ఆమోదం పొందింది. పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో ఓబీసీ బిల్లుకు లోక్‌సభ మంగళవారం ఆమోదం తెలిపింది. ఓబీసీలను గుర్తించే అధికారం రాష్ట్రాలకే అప్పగిస్తూ చట్ట సవరణ చేశారు. ఈ 127వ రాజ్యాంగ చట్ట సవరణ బిల్లును లోక్‌సభ ఆమోదించింది. ఓబీసీ బిల్లుకు ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ సహా, పలు విపక్షాలు మద్దతు తెలిపాయి. బిల్లు ఆమోదం పొందిన నేపథ్యంలో ఇకపై రాష్ట్రాలే ఓబీసీలను గుర్తించేందుకు మార్గం సుగమం అయింది.
 
అంతకుముందు పెగాసస్‌ నిఘా, సాగుచట్టాలపై చర్చించాలంటూ విపక్షాల నిరసనలు.. అందుకు అధికారపక్షం ఏమాత్రం అంగీకరించలేదు. ఉభయసభల్లో గందరగోళం, వాయిదాలు, చర్చలు లేకుండానే పలు బిల్లులకు సభలు ఆమోదం తెలుపుతూ వచ్చాయి. అయితే, ఓబీసీ బిల్లుకు మాత్రం అలాంటి వాతావరణం సభలో మచ్చుకైనా కనిపించలేదు. 
 
ఈ సమావేశాల్లో మొట్టమొదటిసారి.. మంగళవారంనాడు అందుకు భిన్నమైన దృశ్యం ఆవిష్కృతమైంది. ఓబీసీ జాబితాను రూపొందించే అధికారాలను రాష్ట్రాలకు కల్పిస్తూ లోక్‌సభలో కేంద్రం ప్రవేశపెట్టిన రాజ్యాంగ సవరణ బిల్లుకు పార్టీలకు అతీతంగా సభ్యులంతా మద్దతు తెలిపారు. 385 మంది సభ్యులు ఈ బిల్లుకు అనుకూలంగా ఓటు వేశారు. ఎవ్వరూ వ్యతిరేకంగా ఓటేయలేదు. 
 
దీంతో సుదీర్ఘమైన చర్చ అనంతరం ఈ బిల్లు లోక్‌సభ ఆమోదం పొందింది.  బిల్లుకు మద్దతు ప్రకటించిన విపక్షాలు.. రిజర్వేషన్లపై 50 శాతం పరిమితిని ఎత్తివేయాలని డిమాండ్‌ చేశాయి. అలాగే కుల ఆధారిత జనగణన నిర్వహించాలని కోరాయి. ఈ బిల్లుపై చర్చను ప్రారంభించిన కాంగ్రెస్‌ ఎంపీ అధీర్‌ రంజన్‌ చౌధురీ.. దీనికి తాము మద్దతిస్తున్నట్టు తెలిపారు.