పాస్‌పోర్టులపై 'కమలం' గుర్తు - ఎందుకు అలా చేశామంటే?  
                                       
                  
				  				   
				   
                  				  భారత ప్రభుత్వం జారీ చేసే పాస్ పోర్టులపై కమలం గుర్తును ముద్రిస్తున్నారు. ఈ కమలం గుర్తు భారతీయ జనతా పార్టీ ఎన్నికల గుర్తు కావడంతో దీనిపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. దీంతో భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ వివరణ ఇచ్చింది. అదనపు భద్రతా చర్యల్లో భాగంగానే పాస్‌పోర్టులపై కమలం గుర్తును ముద్రిస్తున్నట్టు వివరణ ఇచ్చింది. 
				  											
																													
									  
	 
	కొత్త పాస్‌పోర్టులపై కమలం గుర్తును ముద్రించిన విషయమై లోక్‌సభ జీరో అవర్‌లో కాంగ్రెస్ ఎంపీ ఎంకే రాఘవన్ అభ్యంతరం వ్యక్తం చేశారు. కేరళలోని కోళికోడ్‌లో ఈ పాస్‌పోర్టులను చేస్తున్నారని ఆయన కేంద్రంపై విమర్శలు చేశారు. ఎపుడూ లేనివిధంగా పాస్‌పోర్టులపై కమలం గుర్తు ఏంటంటూ ప్రశ్నించారు. ఈ చర్యపై సర్వత్రా విమర్శలు చెలరేగాయి. 
				  
	 
	ఈ క్రమంలో వీటిపై విదేశాంగ శాఖ స్పందించింది. దీనిపై స్పందించిన విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రవీష్ కుమార్.. కమలం అన్నది జాతీయ చిహ్నాల్లో ఒకటని.. అదనపు భద్రతా చర్యల్లో భాగంగా ఈ జాతీయ చిహ్నాన్ని ముద్రించామని అన్నారు. అంతర్జాతీయ పౌర విమానయాన సంస్థ మార్గదర్శకాలకు అనుగుణంగానే ఈ భద్రతా చర్యలు చేపట్టామని చెప్పుకొచ్చారు. ఇక వచ్చే నెలలో మరో జాతీయ చిహ్నాన్ని ముద్రిస్తామని రవీష్ కుమార్ స్పష్టం చేశారు.