సోమవారం, 30 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 2 ఫిబ్రవరి 2021 (13:05 IST)

చిన్నారులకు పోలియో చుక్కల స్థానంలో శానిటైజర్ తాగించారు... ఎక్కడ?

దేశ వ్యాప్తంగా పోలియో చుక్కల కార్యక్రమం తాజాగా జరిగింది. ఇందులో ఐదేళ్ళలోపు చిన్నారులకు ఈ చుక్కలు వేశారు. అయితే, మహారాష్ట్రంలో ప్రతి ఒక్కరినీ హడలెత్తించే ఘటన జరిగింది. యవత్మాల్‌లో ఏర్పాటు చేసిన పోలియో శిబిరంలో పోలియో చుక్కల స్థానంలో శానిటైజర్‌ను చిన్నారులకు తాగించారు. దీంతో ఈ శానిటైజర్ తాగిన వారంతా అస్వస్థతకు లోనయ్యారు. ఈ ఉదంతం ఘాటాంజీ ప్రాథమిక ఆరోగ్యం కేంద్రంలో చోటుచేసుకుంది. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే.... యవత్మాల్ పరిధిలోని ఒక గ్రామంలో పల్స్ పోలియో కార్యక్రమం నిర్వహించారు. అక్కడి ఆరోగ్య కార్యకర్తలు 12 మంది చిన్నారులకు పోలియో డ్రాప్స్‌కు బదులు హ్యాండ్ శానిటైజర్ తాగించారు. దీంతో వారు కొద్దిసేపటి తర్వాత అనారోగ్యం పాలై ఆసుపత్రిలో చేరారు.
 
ప్రస్తుతం ఆ చిన్నారులంతా చికిత్స పొందుతున్నారు. వారిలో ఇద్దరు బాధిత చిన్నారుల తండ్రి కిషన్ శ్యామ్‌రావు మీడియాతో మాట్లాడుతూ తమ పిల్లలకు పోలియో డ్రాప్స్ వేసిన కొద్దిసేపటి తర్వాత వారు వాంతులు చేసుకున్నారన్నారు. 
 
ఈ విషయాన్ని తాము ఆరోగ్య కార్యకర్తలకు తెలియజేయడంతో వారు పోలియో డ్రాప్స్‌కు బదులు హ్యాండ్ శానిటైజర్ తాగించామని తెలిపారన్నారు. తర్వాత వారు తిరిగి తమ చిన్నారులకు పోలియో డ్రాప్స్ వేశారన్నారు. కాగా ఈ ఉదంతం ఉన్నతాధికారుల వరకూ చేరడంతో వారు ఒక ఆశా కార్యకర్తను సస్పెండ్ చేసి, ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టారు.