బాలికతో మద్యంతాగించి మైనర్ బాలికపై అత్యాచారం
మహారాష్ట్రలో దారుణం జరిగింది. ఈ రాష్ట్రంలోని అమరావతి జిల్లాలోని ఓ హోటల్‌లో 17 యేళ్ల బాలికపై పోలీస్ సబ్‌ఇన్‌స్పెక్టర్ ఒకరు లైంగిక దాడికి పాల్పడినట్టు పోలీసులు వెల్లడించారు. ఆ బాలికకు మద్యం తాగించి మరీ అత్యాచారం చేశాడు. పైగా, నిందితుడితో పాటు బాధితురాలు కూడా ఒకే గ్రామానికి చెందిన వారని తెలిపారు.
పోలీసులు వెల్లడించిన వివరాల మేరకు... అమరావతి జిల్లాకు చెందిన 17 యేళ్ల బాలిక ఒకరు నాగ్‌పూర్‌లో పేయింగ్ గెస్ట్‌గా ఉంటుంది. ఈ బాలికను మాయమాటలు చెప్పి తన బుట్టలో వేసుకున్న ఎస్ఐ ఈ నెల 13వ తేదీన కారులో నగరమంతా తిప్పాడు. ఆపై హోటల్‌కు తీసుకెళ్లి మద్యం తాగించి అత్యాచారానికి పాల్పడ్డాడు. పైగా ఈ విషయం ఎవరికైనా చెబితే తీవ్ర పరిణామాలు ఎదురవుతాయని హెచ్చరించారు.
మరుసటి రోజు ఇంటికి వచ్చిన బాధితురాలు తనకు జరిగిన అన్యాయాన్ని కుటుంబ సభ్యులకు చెప్పింది. దీంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాగా, బాలికపై అత్యాచారానికి పాల్పడిన 35 యేళ్ల ఎస్ఐను పోలీసులు అరెస్టు చేశారు. అతనిపై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. అయితే, నిందితుడు ఎస్ఐ పేరును పోలీసులు బహిర్గతం చేయకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది.