కంటైనర్ తలపులో రూ.362 కోట్ల విలువ చేసే హెరాయిన్!
ముంబై, పంజాబ్ పోలీసులు సంయుక్తంగా చేపట్టిన తనిఖీల్లో ఓ కంటైనర్ తలుపుల్లో అక్రమంగా నిల్వవుంచి రూ.362 కోట్ల విలువ చేసే హెరాయిన్‌ను స్వాధినం చేసుకున్నారు. ఇది రెండు రాష్ట్రాల్లో కలకలం సృష్టించింది.
దుబాయ్ నుంచి నవాషెవా పోర్టుకు చేరిన ఆ కంటైనర్... పాత ముంబై-పుణె జాతీయ రహదారికి ఆనుకొని ఉన్న రాయ్‌గఢ్ జిల్లా పన్వెల్‌లోని ఓ ప్రైవేటు యార్డులో కనిపించింది. నిశితంగా పరిశీలించగా... దాని తలుపు లోపల 168 ప్యాకెట్ల హెరాయిన్ వెలుగుచూసింది.
ఈ మాదకద్రవ్యం మొత్తం బరువు 72.51 కిలోలుగా ఉందని, అంతర్జాతీయ మార్కెట్లో దీని విలువ సుమారు రూ.362.59 కోట్లు ఉంటుందని ముంబై క్రైం బ్రాంచ్ పోలీసులు తెలిపారు. మహారాష్ట్ర పోలీసులతో కలిసి మరోచోట 72 కిలోల నల్లమందును చేజిక్కించుకున్నట్టు పంజాబ్ డీజీపీ తెలిపారు.