శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఎం

మన భద్రతా దళాలు కోవిడ్‌పై కూడా పోరాడగలరు: అమిత్ షా

మన దేశంలో కోవిడ్-19 మహమ్మారిపై పోరాటంలో భద్రతా దళాల పాత్ర ప్రశంసనీయమని కేంద్ర హోం మంత్రి అమిత్ షా చెప్పారు. ‘‘కోవిడ్-19పై భారత దేశం చేస్తున్న యుద్ధంలో, మన భద్రతా దళాలు చాలా గొప్ప పాత్ర పోషిస్తున్నాయి, దీనిని ఎవరూ కాదనలేరు. నేడు ఈ కరోనా యోధులకు గౌరవ వందనం చేస్తున్నాను.

వారు ఉగ్రవాదంపై మాత్రమే కాకుండా ప్రజల సహకారంతో కోవిడ్‌పై కూడా పోరాడగలమని రుజువు చేశారు’’ అని అమిత్ షా అన్నారు. సెంట్రల్ ఆర్మ్‌డ్ పోలీస్ ఫోర్సెస్ దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఆదివారం నిర్వహిస్తున్నాయి. 

హర్యానాలోని కదర్‌పూర్ గ్రామంలో సెంట్రల్ రిజర్వు పోలీస్ ఫోర్స్ (సీఆర్‌పీఎఫ్) ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీ వద్ద జరిగిన కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన అమిత్ షా మాట్లాడుతూ.. కోవిడ్-19 మహమ్మారిపై భారత దేశం విజయవంతంగా పోరాడుతోందని, దీనిని ప్రపంచం ముక్తకంఠంతో ప్రశంసిస్తోందని  చెప్పారు.

మన దేశం కోవిడ్-19పై ఎలా పోరాడగలదు? అని అందరూ అనుకున్నారన్నారు. చాలా మంది భయాలు వ్యక్తం చేశారన్నారు. అయితే కోవిడ్-19పై అత్యంత విజయవంతమైన పోరాటాల్లో ఒకటి మన దేశంలో ఎలా జరుగుతోందో ప్రపంచం నేడు గమనిస్తోందని చెప్పారు.

మొక్కలు నాటే కార్యక్రమం చాలా మంచిదని చెప్తూ, ఈ మొక్కలను పెంచే బాధ్యతను జవాన్లు చేపట్టాలన్నారు. రాబోయే తరాలకు ఉపయోగపడే మొక్కలను ఎంపిక చేయడాన్ని ప్రశంసించారు.