శనివారం, 30 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 4 ఆగస్టు 2022 (13:48 IST)

అగ్నిపథ్‌కు పోటెత్తిన దరఖాస్తులు - పోటీపడుతున్న అమ్మాయిలు

agniveers
కేంద్రం కొత్తగా ఇటీవల తీసుకొచ్చిన అగ్నిపథ్ పథకంలో చేరేందుకు యువతీయువకులు పోటీపడుతున్నారు. ముఖ్యంగా నేవీలో పని చేసేందుకు అమ్మాయిలు అమితమైన ఆసక్తి చూపుతున్నారు. ఈ పథకం కింద నేవీ విభాగంలో మూడు వేల ఉద్యోగ నియామకాలు చేపడుతుంది. వీటికోసం దాదాపు 9.55 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో 82 వేల మంది అమ్మాయిలు కూడా ఉన్నారు. 
 
నేవీలోని అన్ని విభాగాల్లో లింగ తటస్థను పాటించేలా అగ్నిపథ్ పథకంలో మహిళా నావికులను నియమించాలని భారత నావికాదళం గత జూన్ 20వ తేదీ నిర్ణయించిన విషయం తెల్సిందే. దీంతో ఈ విభాగంలో చేరేందుకు అమ్మాయిలు ఆసక్తి చూపుతున్నారు. 
 
అగ్నిపథ్ పథకం కింద ఆఫీసర్ల స్థాయి కంటే దిగువ క్యాడర్ సిబ్బందిని త్రివిధ దళాల్లో చేర్చుకోవాలని కేంద్రం నిర్ణయం తీసుకున్న విషయం తెల్సిందే. అగ్నిపథ్ పథకంలో ఎంపికైన వారిని అగ్నివీరులుగా పరిగణిస్తారు. 
 
వీరికి నాలుగేళ్ల పాటు శిక్షణ ఇచ్చి 25 శాతం మందిని రైటైన్ చేస్తారు. వంద మందిలో 25 మందిని రెగ్యులరైజ్ చేసి 15 యేళ్లపాటు నాన్ ఆఫీసర్ హోదాలో రక్షణ శాఖలో పని చేసే అవకాశం కల్పిస్తారు.