'చెత్త రహిత దేశం' - స్వచ్ఛ భారత్ రెండో దశ ప్రారంభం
దేశాన్ని చెత్త రహిత భారత్‌గా మార్చేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రవేశపెట్టిన పథకం స్వచ్ఛ భారత్. ఈ పథకం రెండో దశను శుక్రవారం నుంచి ప్రారంభించారు. దేశంలోని అన్ని నగరాలను చెత్త రహితంగా తీర్చిదిద్దే లక్ష్యంతో పాటు పట్టణ ప్రాంతాల్లో ప్రతి ఇంటికీ రక్షిత మంచినీటిని సరఫరా చేసేందుకు అమృత్ పథకాల రెండో దశకు కేంద్రం శ్రీకారం చుట్టింది.
ప్రధాని నరేంద్ర మోడీ శుక్రవారం ఢిల్లీలో ఈ పథకాల రెండో దశను ప్రారంభించారు. రూ.1.14 లక్షల కోట్ల వ్యయంతో ఎస్‌బీఎం-యూ 2.0, అలాగే, రూ.2.87 లక్షల కోట్లతో అమృత్ 2.0 అమలు చేయనున్నారు.
భారత్‌ను వేగవంతంగా పట్టణీకరించడంలో సవాళ్లను పరిష్కరించడం, సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు-2030 సాధనలో ఇదొక ముంద డుగుగా పీఎంవో అభివర్ణించింది. డాక్టర్ అంబేద్కర్ అంతర్జాతీయ కేంద్రంలో ఉదయం 11 గంటలకు ప్రధాని ఈ రెండు పథకాల రెండో దశను ప్రారంభించారు.
అమృత్ రెండో దశలో భాగంగా దాదాపు 4,700 పట్టణ స్థానిక సంస్థల్లో కొత్తగా 2.68 కోట్ల కుళాయి కనెక్షన్లు ఇవ్వడం ద్వారా ప్రతి ఇంటికీ రక్షిత నీరు సరఫరా చేస్తారు. అలాగే, 500 అమృత్ నగరాల్లో కొత్తగా 2.64 కోట్ల సీవర్ లేదా సెప్టేజ్ కనెక్షన్లు కల్పించడం ద్వారా ప్రతి ఇంటికీ మురుగునీటి నిర్వహణ వసతి కల్పిస్తారు. అన్ని పట్టణ స్థానిక సంస్థలను బహిరంగ విసర్జన రహితంగా తీర్చిదిద్దడంతో పాటు ఘన వ్యర్థాలను శాస్త్రీయంగా శుద్ధి చేయడంపై దృష్టి సారిస్తారు.