ఆదివారం, 12 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 11 డిశెంబరు 2020 (15:11 IST)

హైటెన్షన్ విద్యుత్ తీగలు తెగి.. స్కూటీపై పడ్డాయి.. టీచర్ సజీవదహనం

రాజస్థాన్‌లో ఘోరం జరిగిపోయింది. హైటెన్షన్ విద్యుత్ తీగలు తెగి.. రోడ్డుపై వెళ్తున్న స్కూటీపై పడ్డాయి. ఈ ఘటనలో స్కూల్ టీచర్ మృతి చెందారు. ఈ ఘటన జరగడానికి కాసేపటికి ముందే ఆ ప్రాంతంలో వర్షం పడడంతో రోడ్డంతా తడిగా ఉంది. అందుకే తమకూ షాక్ తగులుతుందనే భయంతో.. ఎవరూ ఆమె వద్దకు వెళ్లే ప్రయత్నం చేయలేదు. అలా క్షణాల్లోనే స్కూటీ కాలి బూడిదయింది.
 
వివరాల్లోకి వెళితే... బాగిదౌరాకు చెందిన నీలం పాటిదార్ అనే మహిళ.. స్కూల్ టీచర్‌గా పనిచేస్తున్నారు. శుక్రవారం ఉదయం తన ఇంటి నుంచి స్కూటీపై నౌగామాకు బయలుదేరారు. రోడ్డుపై వెళ్తున్న సమయంలో ఒక్కసారిగా హైటెన్షన్ విద్యుత్ తీగలు తెగి స్కూటీపై పడ్డాయి. అది 11 కేవీ విద్యుత్ లైన్ కావడంతో వెంటనే మంటలు అంటుకున్నాయి. రోడ్డుపై అందరూ చూస్తుండగానే క్షణాల్లో బండి తగలబడిపోయింది. టీచర్ నీలం కూడా సజీవ దహనమయ్యారు. 
 
అందరి కళ్ల ముందే హాహా కారాలు చేస్తూ కన్నుమూశారు. స్థానికుల నుంచి సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని.. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. అనంతరం కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. ఈ ఘటన స్థానికంగా అందరినీ కంటతడి పెట్టింది. అదే సమయంలో భయాందోళనకు గురిచేసింది.