బుధవారం, 27 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఎం
Last Updated : మంగళవారం, 29 డిశెంబరు 2020 (19:04 IST)

బెంగళూరులో 144 సెక్షన్‌

రోనా వైరస్‌ వ్యాప్తిని దృష్టిలో పెట్టుకొని నూతన సంవత్సర వేడుకలపై బెంగళూరు పోలీసులు ఆంక్షలు విధించారు. నగరంలో 144 సెక్షన్‌ అమలు చేయనున్నట్టు వెల్లడించారు. డిసెంబర్‌ 31న సాయంత్రం 6 గంటల నుంచి జనవరి 1, 2021 ఉదయం 6గంటల వరకు ఆంక్షలు అమలులో ఉంటాయని నగర పోలీస్‌ కమిషనర్‌ కమల్ పంత్‌ స్పష్టంచేశారు.

ఎంజీ రోడ్‌, చర్చి స్ట్రీట్‌, బ్రిగేడ్‌ రోడ్‌, కోరమంగళ, ఇందిరానగర్‌ను ‘నో మ్యాన్‌ జోన్‌’లుగా ప్రకటిస్తున్నట్టు తెలిపారు. నగరంలోని పబ్‌లు, బార్లు, రెస్టారెంట్లలో ముందస్తుగా రిజర్వేషన్‌ కూపన్లు తీసుకున్నవారికే అనుమతి ఉంటుందన్నారు.

కొత్త సంవత్సర వేడుకలను ప్రజలు తమ నివాస సముదాయాల్లోనే నిర్వహించుకోవాలని, ఆ సమయంలో కొవిడ్‌ నిబంధనలను కచ్చితంగా పాటించాలని కోరారు. మ్యూజికల్‌ నైట్స్, షోలు వంటి ప్రత్యేక ఈవెంట్లను మాల్స్‌, పబ్‌లు, రెస్టారెంట్లు, క్లబ్‌ హౌస్‌లలో అనుమతించబోమని కమిషనర్‌ స్పష్టంచేశారు. 

కరోనా కేసులు గణనీయంగా తగ్గినప్పటికీ బ్రిటన్‌లో వచ్చిన కొత్త వైరస్‌ స్ట్రెయిన్‌తో కర్ణాటక ప్రభుత్వం మరోసారి అప్రమత్తమైంది. మరోవైపు, బహిరంగ ప్రదేశాల్లో న్యూ ఇయర్‌ వేడుకలు జరుపుకొనేందుకు అనుమతించబోమని రాష్ట్ర హోంమంత్రి బసవరాజ్‌ బొమ్మై కూడా స్పష్టంచేశారు.

గడిచిన 24 గంటల్లో కర్ణాటకలో 653 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. తాజాగా మరో 1178 మంది డిశ్చార్జి కాగా.. 8 మంది ప్రాణాలు కోల్పోయారు. తాజా గణాంకాలతో కలిపితే కర్ణాటకలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 9,16,909కి చేరింది. వీరిలో 8,92,273మంది కోలుకొని డిశ్చార్జి కాగా.. 12,070 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం 12,547 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి.