ఆదివారం, 1 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: గురువారం, 30 మార్చి 2023 (23:07 IST)

మార్చి 31న నీతా ముఖేష్ అంబానీ కల్చరల్ సెంటర్ ప్రారంభం

nita ambani
'నీతా ముఖేష్ అంబానీ కల్చరల్ సెంటర్' ప్రారంభానికి సిద్ధంగా ఉంది. శుక్రవారం సందర్శకుల కోసం సాంస్కృతిక కేంద్రాన్ని తెరిచి వుంచుతారు. ప్రారంభం సందర్భంగా మూడు రోజుల బ్లాక్‌బస్టర్ షో ఉంటుంది. భారతదేశంతో పాటు విదేశాల నుండి కళాకారులు, బాలీవుడ్- హాలీవుడ్ నుండి ప్రముఖులతో పాటు పలువురు ప్రముఖులు కూడా ఇందులో పాల్గొననున్నారు. ప్రారంభానికి ఒక రోజు ముందు, రామనవమి శుభ సందర్భంగా, నీతా అంబానీ కల్చరల్ సెంటర్‌కు చేరుకుని మంత్రోచ్ఛారణల మధ్య ప్రార్థనలు చేశారు.
 
ప్రారంభోత్సవంలో "స్వదేశ్" పేరుతో ప్రత్యేక కళలు- చేతిపనుల ప్రదర్శన కూడా నిర్వహించబడుతుంది. 'ది గ్రేట్ ఇండియన్ మ్యూజికల్: సివిలైజేషన్ టు నేషన్' పేరుతో మ్యూజికల్ డ్రామా ఉంటుంది. భారతీయ కోచర్ సంప్రదాయాన్ని తెలిపే 'ఇండియా ఇన్ ఫ్యాషన్' పేరుతో కోచర్ ఆర్ట్ ఎగ్జిబిషన్ ఉంటుంది. దీనితో పాటు భారతదేశ సంస్కృతీ సంప్రదాయాలు ప్రపంచంపై చూపుతున్న ప్రభావాన్ని తెలిపే ‘సంగం’ పేరుతో విజువల్ ఆర్ట్ షో ఉంటుంది.
 
'నీతా ముఖేష్ అంబానీ కల్చరల్ సెంటర్' దేశంలోనే మొదటి సాంస్కృతిక కేంద్రం. భారతీయ, అంతర్జాతీయ కళాకారుల ప్రదర్శన కోసం 16 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో నాలుగు అంతస్తుల ఆర్ట్ హౌస్ ఉంది. 8,700 అమూల్యమైన స్ఫటికాలతో అలంకరించబడిన అద్భుతమైన లోటస్ నేపథ్య షాన్డిలియర్ ఉంది. 2000 సీట్లతో గ్రాండ్ థియేటర్ ఉంది. ఇందులో దేశంలోనే అతిపెద్ద ఆర్కెస్ట్రా పిట్‌ను నిర్మించారు. చిన్న ప్రదర్శనలు, ఈవెంట్‌ల కోసం 'స్టూడియో థియేటర్', 'ది క్యూబ్' వంటి అద్భుతమైన థియేటర్‌లు ఉన్నాయి. వీటన్నింటిలో అడ్వాన్స్ టెక్నాలజీని ఉపయోగించారు.
 
ఈ సందర్భంగా నీతా అంబానీ మాట్లాడుతూ, “సాంస్కృతిక కేంద్రం కలను సాకారం చేయడం నాకు పవిత్రమైన ప్రయాణం, మన సాంస్కృతిక వారసత్వం విరాజిల్లుతున్న ప్రదేశాన్ని సృష్టించాలనుకుంటున్నాము. సినిమా లేదా సంగీతం, నృత్యం లేదా నాటకం కావచ్చు. సాహిత్యం లేదా జానపదం, కళ లేదా క్రాఫ్ట్, సైన్స్ లేదా ఆధ్యాత్మికత కావచ్చు. దేశంలోని, ప్రపంచంలోని అత్యుత్తమ కళా ప్రదర్శనలు సాంస్కృతిక కేంద్రంలో సాధ్యమవుతాయి. ప్రపంచంలోని ఉత్తమ కళలు, కళాకారులు భారతదేశంలో స్వాగతించబడతారు." నీతా ముఖేష్ అంబానీ కల్చరల్ సెంటర్‌లో పిల్లలు, విద్యార్థులు, సీనియర్ సిటిజన్లు, వికలాంగులకు ఉచిత ప్రవేశం ఇవ్వబడుతుంది. పాఠశాల-కళాశాల ఔట్‌రీచ్ ప్రోగ్రామ్ లేదా ఆర్ట్-టీచర్స్ అవార్డు ప్రోగ్రామ్ లేదా గురు-శిష్య సంప్రదాయం వంటి అన్ని కార్యక్రమాలపై కేంద్రం ప్రత్యేక శ్రద్ధ చూపుతుంది.