బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఎం
Last Updated : బుధవారం, 24 ఫిబ్రవరి 2021 (08:36 IST)

21 రాష్ట్రాల్లో కరోనా మరణాలు లేవు

గత 24 గంటల్లో 21 రాష్ట్రాల్లోనూ, కేంద్రపాలిత ప్రాంతాల్లోనూ ఒక్క కరోనా మరణమూ నమోదు కాలేదు. ఈ మేరకు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. అయితే.. కొన్నిరోజులుగా దేశంలో కేసుల సంఖ్య పెరుగుతూ ఉండడం కొంత ఆందోళన కలిగించిన విషయం విధితమే.

పది రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో 5లోపు మరణాలు, రెండు రాష్ట్రాల్లో పదిలోపు, 3 రాష్ట్రాల్లో 20లోపు మరణాలు నమోదైనట్లు ఆరోగ్యశాఖ ప్రకటించింది. సోమవారం క్రియాశీల కేసులు 1,50,055 ఉండగా, మంగళవారానికి ఆ సంఖ్య 1,47,306కు చేరింది. క్రితం రోజుతో పోలిస్తే 25శాతం తక్కువ కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది.

మరోవైపు కరోనా రికవరీల సంఖ్య 1,07,12,665కు చేరింది. రికవరీ రేటు 97.24 శాతంగా ఉంది. కొత్తగా నమోదైన కేసుల్లో 84శాతం ఆరు రాష్ట్రాల నుండే నమోదయ్యాయి. మహారాష్ట్ర (5210), కేరళ (2212), తమిళనాడు (449) మొదటి మూడు స్థానాల్లో ఉన్నట్లు అధికారులు తెలిపారు. అలాగే మంగళవారం ఉదయం 8గంటల వరకు 1,17,45,553 మందికి వ్యాక్సిన్‌ అందజేసినట్లు ఆరోగ్యశాఖ తెలిపింది.

వీరిలో 1,04,87,375 మంది ఆరోగ్య సిబ్బంది, ఫ్రంట్‌లైన్‌ వర్కర్లకు మొదటి డోసు, 12,58,177మందికి రెండోడోసు అందించారు. 38వ రోజు వ్యాక్సిన్‌ పంపిణీలో భాగంగా 3,38,373 మందికి మొదటి డోసు, 2,90,323 మందికి రెండో డోసును అందించామని కేంద్ర ఆరోగ్యశాఖ పేర్కొంది.