శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 28 జనవరి 2020 (12:26 IST)

ఇళ్ళలోకి వచ్చి మీ కూతుళ్లను రేప్ చేసి చంపేస్తారు.. తస్మాత్ జాగ్రత్త : బీజేపీ ఎంపీ వార్నింగ్

దేశ రాజధాని ఢిల్లీలో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. ఈ ఎన్నికలను కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఎందుకంటే దేశవ్యాప్తంగా ఉన్న రాష్ట్రాల్లో సత్తా చాటుతున్న కమలనాథులు.. దేశానికి కేంద్రంగా ఉన్న హస్తినలో మాత్రం చతికిలపడటాన్ని ఏమాత్రం జీర్ణించుకోలేక పోతోంది. దీంతో ఈ ఎన్నికలను బీజేపీ అత్యంత సవాల్‌గా తీసుకుంది. దీంతో కమలనాథులు ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశారు. 
 
ముఖ్యంగా, షాహీన్‌బాగ్‌ ధర్నా కేంద్రం చుట్టే ఢిల్లీ రాజకీయాలు తిరుగుతున్నాయి. షాహీన్‌బాగ్‌ వద్ద ధర్నా చేస్తున్న ఆందోళనకారులు.. ఢిల్లీ ప్రజల నివాసాల్లోకి చొరబడి రేప్‌ చేసి చంపేస్తారని భారతీయ జనతా పార్టీ ఎంపీ పర్వేశ్‌ వర్మ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
 
ఓ ప్రైవేటు న్యూస్‌ ఏజెన్సీకి పర్వేశ్‌ వర్మ ఇంటర్వ్యూ ఇస్తూ.. సీఏఏకు వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేసేందుకు షాహీన్‌బాగ్‌ వద్దకు లక్షలాది మంది ఆందోళనకారులు చేరుకుంటున్నారు. ఈ ధర్నాపై ఢిల్లీ ప్రజలు ఒకసారి ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. ఆందోళనకారులు ఢిల్లీ ప్రజల ఇళ్లలోకి చొచ్చుకొచ్చి మీ సోదరిమణులు, కూతుళ్లను రేప్‌ చేసి చంపేసే అవకాశం ఉంది. 
 
ఈ రోజు వరకు సమయం ఉంది. రేపటి వరకు ఈ ధర్నా ఇలాగే కొనసాగి.. అత్యాచారం చేసి చంపితే.. మోడీ, అమిత్‌ షాలు కూడా మిమ్మల్ని కాపాడలేరని ఢిల్లీ ప్రజలను ఉద్దేశించి పర్వేశ్‌ వర్మ పేర్కొన్నారు. ఫిబ్రవరి 11వ తేదీ ఢిల్లీలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తే.. గంటలో షాహీన్‌బాగ్‌ను క్లియర్‌ చేస్తామని వర్మ చెప్పారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే తన నియోజకవర్గం పరిధిలో ప్రభుత్వ భూముల్లో నిర్మించిన మసీదులను నెల రోజుల్లో కూల్చేస్తామని పర్వేశ్‌ వర్మ తెలిపారు.