శుక్రవారం, 29 నవంబరు 2024
  1. ఇతరాలు
  2. ఎన్.ఆర్.ఐ.
  3. ప్రత్యేక వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: మంగళవారం, 15 నవంబరు 2022 (22:55 IST)

డల్లాస్‌లో ఘనంగా నాట్స్ బాలల సంబరాలు

Balala sambaralu
అమెరికాలో తెలుగుజాతి కోసం అనేక కార్యక్రమాలు చేపడుతున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ తాజాగా డల్లాస్‌లో బాలల సంబరాలు నిర్వహించింది. డల్లాస్‌లోని స్థానిక సెయింట్ మేరీస్ ఆర్థోడాక్స్ చర్చ్  వేదికగా ఈ బాలల సంబరాలు జరిగాయి.. ప్రతి ఏటా పండిట్ జవహర్ లాల్ నెహ్రు జన్మదినం సందర్భంగా నాట్స్ బాలల సంబరాలను నిర్వహిస్తూ వస్తుంది. తెలుగు చిన్నారుల్లో ఉన్న ప్రతిభ పాటవాలను ప్రోత్సహించేందుకు నిర్వహిస్తున్న ఈ బాలల సంబరాలకు అద్భుతమైన స్పందన లభించింది. దాదాపు 250 మందికి పైగా బాల బాలికలు ఈ సంబరాల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు.

బాలల సంబరాలను పురస్కరించుకుని తెలుగు సంప్రదాయ నృత్యం, సినీ నృత్యం, సంప్రదాయ సంగీతం, సినీ సంగీతం, చదరంగం, గణితం, తెలుగు వక్తృత్వం, తెలుగు పదకేళి అంశాల్లో నాట్స్ పోటీలు నిర్వహించింది. పదేళ్లలోపు, పదేళ్లపైన ఉన్న చిన్నారులను రెండు వర్గాలుగా విభజించి నిర్వహించిన ఈ పోటీల్లో అనేక మంది పిల్లలు తమ ప్రతిభను ప్రదర్శించారు.. ఈ పోటీల్లో మొదటి మూడు స్థానాల్లో నిలిచిన వారికి నాట్స్ బహుమతులు అందించింది.
 
సత్య శ్రీరామనేని, రవి కుమార్ తాండ్ర, రవీంద్ర చుండూరు, శ్రీనాథ్ జంధ్యాల ఈ బాలల సంబరాలు కార్యక్రమ నిర్వహణలో కీలక పాత్ర పోషించారు. నాట్స్ జాతీయ కార్యవర్గ సభ్యులు కవిత దొడ్డ, డి వి ప్రసాద్, జ్యోతి వనం, తేజ వేసంగి, డల్లాస్ చాప్టర్ కార్యవర్గ సభ్యులు రవి తుపురాని, మణిధర్ గూడవల్లి, స్వప్న కాట్రగడ్డ, శ్రీధర్ న్యాలమడుగుల, నాగిరెడ్డి, శ్రీనివాస్ ఉరవకొండ, గౌతమ్ కాసిరెడ్డి,  పార్ధ బొత్స, కృష్ణ వల్లపరెడ్డి, సురేంద్ర ధూళిపాళ్ల, యువ నిర్వాహకులు నిఖిత దాస్తి, యశిత చుండూరు, రేహాన్ న్యాలమడుగుల, ప్రణవి మాదాల తదితరులు బాలల సంబరాల విజయవంతం చేసేలా కృషి చేశారు. ఇంకా ఈ కార్య క్రమంలో నాట్స్ బోర్డు అఫ్ డైరెక్టర్స్ రాజేంద్ర మాదాల, ప్రేమ్ కలిదిండి పాల్గొని వారి తోడ్పాటుని అందించారు. స్థానికంగా ప్రసిద్దులైన ప్రముఖ సంగీత, నృత్య గురువులు ఈ సంబరాల్లో న్యాయ నిర్ణేతలుగా వ్యపహరించారు.
 
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా శ్రీ జంధ్యాల పాపయ్య శాస్త్రి కుమారులు శ్రీ బాపూజీ జంధ్యాల విచ్చేసి నాట్స్ పోటీలలో పాల్గొన్న చిన్నారులను అభినందించారు. తెలుగు బాల బాలికలను  ప్రోత్సహించడానికి, వారిలో నాయకత్వ లక్షణాలను పెంపొందించడానికి ఏర్పాటుచేసిన ప్రత్యేక  వేదిక ఈ బాలల సంబరాలు కార్యక్రమమని నాట్స్ అధ్యక్షులు బాపయ్య చౌదరి నూతి (బాపు) అన్నారు. గత పన్నెండు సంవత్సరాలుగా బాలల సంబరాలను దిగ్విజయవంతంగా నిర్వహిస్తున్న నాట్స్ డల్లాస్ చాప్టర్ కార్యకర్తలందరికీ ప్రత్యేక అభినందనలు తెలియ చేసారు. అమెరికాలో తెలుగు చిన్నారుల కోసం నాట్స్ డల్లాస్ విభాగం ఘనంగా నిర్వహించడంలో కృషి చేసిన ప్రతి ఒక్కరికి నాట్స్ చైర్ వుమన్ అరుణ గంటి తన సందేశం ద్వారా ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నాట్స్ నిర్వాహకులు పిల్లలకు లక్కీ డ్రా నిర్వహించి కొన్ని బహుమతులను అందించారు. స్వాగత్ బిర్యానీస్ ఇండియన్ క్యూసిన్, ఫార్మ్2కుక్, హింద్ సైట్, కోపెల్ చెస్ క్లబ్, వైకుంట్ డెవలపర్స్, క్లౌడ్ జెనిక్స్, ఏజెనిక్స్ ఫార్మాస్యూటికల్స్, సాఫ్ట్ స్కూల్స్.కామ్ ఈ కార్యక్రమ నిర్వహణకు తమ సహాయాన్ని అందించాయి.