శుక్రవారం, 24 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. కథనాలు
Written By ttdj
Last Updated : శుక్రవారం, 19 ఆగస్టు 2016 (16:39 IST)

తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి (మూల విరాణ్మూర్తి) గురించి తెలుసుకుందామా...!

అదిగో.. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుని అంత:పుర మందిరం. అల్లదివో అందరి పాలిటికి అందుబాటులో ఉన్న దేవాదిదేవుని నిలయం. అందరికీ పరమానందాన్ని పంచిపెడుతూ ఉన్న ఆనంద నిలయం. ఆ ఆనంద నిలయం మధ్య భాగాన దైవస్థానంలో

అదిగో.. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుని అంత:పుర మందిరం. అల్లదివో అందరి పాలిటికి అందుబాటులో ఉన్న దేవాదిదేవుని నిలయం. అందరికీ పరమానందాన్ని పంచిపెడుతూ ఉన్న ఆనంద నిలయం. ఆ ఆనంద నిలయం మధ్య భాగాన దైవస్థానంలో తనకు తానే వ్యక్తమై అభివ్యక్తమై ఆవిర్భవించి నిలిచి ఉన్న పవిత్ర సాలగ్రామశిలా దివ్యమూర్తి శ్రీ వేంకటేశ్వరస్వామి. దండిగా దర్శనమిస్తూ.. మెండుగా మనందరినీ మైమరపిస్తూ ఉన్న స్వామివారి దివ్యమంగళ విగ్రహాన్ని ఆపాద మస్తకం కన్నులపండువగా కన్నులనిండుగా రెప్ప వాల్చకుండా భక్తులు తిలకిస్తూ ఉంటారు. 
 
అదిగో.. బంగారు పద్మపీఠం. ఆ పీఠంపై ఉన్న శ్రీవారి కనకపు పాదాలు. గజ్జెలు..అందెలు. ఆ పైన ఘనపట్టు పీతాంబరం. ఆ పీతాంబరం కుచ్చిళ్ళపై జీరాడుతూ వేలాడుతూ ఉన్న సహస్ర నామాల మాలలు. నాభీ దగ్గర సూర్య కళారి అనబడే నందక ఖడ్గం. నడుమును బిగించి ఉన్న ఒడ్డాణం. బంగారు మొలతాడు. అదివో వజ్ర ఖచిత వరదహస్తం. అదే కదా తనపాదాలే పరమార్థం అని చూపిస్తున్న వైకుంఠ హస్తం. ఇదో ఇటు ఎడమవైపు తనను శరణువేడితే సంసార సముద్రం మోకాళ్ళబంటే అని ఒయ్యారంగా చూపుతూ ఉన్న కటి హస్తం. ఉరముపై కౌస్తుబమణి నవరత్నహారాలు.. వక్షస్థలంపై ఆశీనురాలై అనుగ్రహిస్తూ ఉన్న వ్యూహలక్ష్మి. సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మి అదివో..శ్రీదేవి శూదేవి పతకాల హారాలు కంఠమాలలు. అదె బంగగారు యజ్ఞోపవీతం. చేతులకు నాగాభరణాలు ఆ పైన భుజకీర్తులు. భుజాల నుంచి పాదాలా వరకు వేలాడుతూ ఉన్న పవిత్ర సాలగ్రామ మాలలు. 
 
భక్తులకు అభయమొసంగే శంఖుచక్రాలు..అదో నల్లని మోము..అదే చెరగని, తరగని చిరుమందహాసం..నిగనిగలాడే చెక్కిళ్ళు..కర్ణాలంకారాలు..దొండపండువంటి పెదవులు. ఆ పెదవుల కింద చుబుకం. పైన చక్కనైన తెల్లని కప్పురపు చుక్క. ఆపైన సొగసైన నాసిక. తెల్లని నామం. భక్తులను కరుణిస్తూ ఉన్న ఎడతెగని అంటుచూపులు. అదిగో శిరసుపై అమరి ఉన్న నవరత్నాల మకుట రాజం. ఆపై బంగారు మకరతోరణం. ఇంతేనా..ఇంకా..ఇంకా..ఆ మూర్తి నిలువెత్తుగా అలంకరింపబడ్డ సుగంధ సుమనోహర సుమ మాలలు. 
 
ఏమీ అద్భుతం. ఏమేమి పరమాద్భుతం. ఎన్నెన్ని హారాలు. ఎన్నెన్ని అలంకారాలు. ఎన్నెన్ని మణులు. ఎన్నెన్ని మాణిక్యాలు. ఎంతెంత వైభవం. ఎంతెంత సోయగం. ఎంతెంత సొంపు. ఏమి సమ్మోహనం. ఏమి మైమరపు. ఎంతెంత అందం. ఎంతెంత పరమానందం. ఏదో తెలియని లోకాల్లో విహరిస్తూ ఆనందపుటంచుల్ని తాకుతూ ఉన్నట్లు భక్తులకు అనిపిస్తుంది. 
 
ఈ ఆభరణాలను అలంకరించుకొన్నందు వల్ల ఆనంద నిలయుడైన శ్రీ స్వామివారు అందంగా కనపడుతున్నాడా.. లేక నిగమ నిగమాంతవేద్యుడైన ఈ స్వామివారిని అంటిపెట్టుకున్నందువల్లే ఆ నగలు నిగనిగలతో వింత వింతలుగా వెలుగుతూ ప్రకాశిస్తూ ఉంటాయి. అని ఆశ్చర్యాన్ని, అద్భుతాన్ని, ఆనందాన్ని కలిగించే వెలలేని, తులలేని, ప్రతిలేని నగలూ, నాణ్యాలూ, ఆభరణాలు హారాలూ, అలంకారాలూ, ఏ భక్తులిచ్చారో కదా. ఎప్పుడెప్పుడిచ్చారో కదా. ఎందుకిచ్చారో కదా..అన్న సందేహ సంభ్రమాశ్చర్యాలతో ఉబ్బి తబ్బిబై నిశ్చేష్టులవుతారు భక్తులు.
 
తన సుందర రూపాన్ని చూసిన తక్షణమే మనకు ఇంతటి పరమోన్నత పరమానంద స్థితిని కలిగించిన ఈ పరంధాముణ్ణి ఈ తిరుమల గోవిందుణ్ణి ఒక్కసారి గొంతెత్తి ప్రార్థించండి.. ఈ తిరుమల పెరుమాళ్ళు ఒడలెల్ల ధరించిన ఈ బంగారు తొడుగులకు ఒక్కొక్కదానికి ఒక్కొక్క అద్భుతమన చరిత్ర ఉంది. ఒక్కొక్క నగ వెనుకా ఒక నాణ్యమైన భక్తుని ప్రేమా, త్యాగం నిగనిగలాడతాయి. అదిగో మినుకు మినుకు మని మెరిసే రతనాల మెరుపుల్లో ఘనవేంకటేశుని భక్తప్రియత్వం గోచరిస్తుంది. అదిగో ఆ కొండ రాయని కర కంకణాల రవళిలో ఆ స్వామివారి భక్త రక్షణ దీక్షాకంకణత్వం వినిపిస్తుంది. అదిగో ధగ ధగమని మెరుస్తున్న వజ్రకిరీటం. ఎందరి భక్తుల పాపాల్ని దగ్థం చేసిందో..అదిగో సర్రున తిరుగుతున్న సుదర్శన చక్రం. ఎందరి జీవిత చక్రాల్ని సక్రమంగా గిర్రున తిప్పిందో.
 
అల్లదివో పాంచజన్య శంఖం. ఎందరి పాపాత్ముల గుండెల్ని బద్దలు చేసిందో.. ఆ ఆనందనిలయుడు ధరించిన ఆ నందక ఖడ్గం. అది ఎందరి ఆర్తిని పోగొట్టిందో. మరెందరి ఆపదనలను తొలగించిందో. బంగారు పాదపద్మాలు..ఎందరి పాపాల్ని కడిగి పరమోన్నత జీవితం ప్రసాదించాయో..ఎందరి శాశ్వత వైకుంఠం ప్రసాదించాయో..ఎందరికి భవబంధాలు తెంచాయో..ఎవరి కెరుక. మూసిన ముత్తెము వలె ముసి ముసి నవ్వులతో ఏమీ ఎరుగనట్టు ఉన్న స్వామివారు ఎందరికీ కాళ్ళిచ్చాడో. ఎందరికి కళ్ళిచ్చాడో. ఇంకెందరికి చేతులిచ్చాడో..మరెందరికి చేయూత నిచ్చాడో.. ఎందరికి కడుపు నింపాడో..మరెందరి కడుపును పండించాడో.. ఎందరికీ మాటలిచ్చాడో..ఇంకెందరికి మాట నిలబెట్టాడో...ఎందరికి తెలుసు. మరెందరికి తెలుసు. ఆ స్వామికే తెలియాలి. ఆ స్వామికి మాత్రమే తెలియాలి. 
 
కాబట్టే వెల్లువలై పారిన కొండలరాయని కరుణరస సప్రవాహంలో ఆర్తిగా అర్థంగా మునకలిడిన ఆర్తులు, అర్థులు, జిజ్ఞాసులు, జ్ఞానులైన భక్తజనం తమ మనసుల నిండా, గుండెల నిండా బంగారు మేడలోని బ్రహ్మాండ నాయకుణ్ణి నింపుకున్నారు. పదిల పరుచుకున్నారు. మనసా, వాచా, కర్మణా తమ, తనువులను మనస్సులను  స్వామివారికే మీద కట్టివారు ఆ వరాలరాయనికి కృతజ్ఞతగా కానుకలు పెట్టుకున్నారు. మురిపెంగా ముడుపులు చెల్లించుకుంటున్నారు. ముచ్చటగా ముత్యాలహారాలు సమర్పించుకున్నారు. ఇలా..తాము మెచ్చిన రీతిలో తమకు నచ్చిన తీరులో తిరుమలప్పనికి అలంకారాలు సమర్పించారు. ఆభరణాలు ఇచ్చారు. అదిగో..చూడండి.. అనంతకాల గమనంలో తన భక్తులు మెచ్చి ఇచ్చిన హారాలను ఆభరణాలను తనువెల్ల అలంకరించుకొన్న ఆ శ్రీనివాసుడు దీటులేని అందగాడై సాటిలేని శంఖ చక్రాల మొనగాడై ఎంత సింగారాలు ఒలక బోస్తున్నాడో..
 
అంతే కాదు ఆ సింగారాల్లో ఆ నయగారాల్లో..ఆ సోయగాల్లో ఆ సొంపుల్లో ఇనుప ముక్కల్ని ఆకర్షిస్తున్న సూదంటు రాయివలె మనందరినీ ఆకర్షిస్తున్నాడు. మన అందరినీ కూడా ఆకట్టుకుంటున్నాడు. చిన్నా, పెద్దా తేడా లేదు. ఆడా మగా తారతమ్యం లేదు. అంగవైకల్యం అనే ఈసడింపు ఇనుమంతయినా లేదు. కుల, మత, వర్గ, వర్ణ విచక్షణ అసలే లేదు. భాషా భేధం అంతకన్నా లేదు. ఆ కొండల రేడు అందరి కోరికలూ తీరుస్తాడు. అందరి మాటలూ వింటాడు. అందరి బాషలూ మాట్లాడుతాడు. అందరి వూసులూ వింటాడు. కేవలం వినడమే కాదు. వారివారి బాసల్లోనే మౌనంగా జవాబిస్తాడు. వారి వారి కోరికలను తీరుస్తాడు. భక్తుల కోరికలు ఎలాంటివైనా సరే. సిగ్గూ బిడియం వదిలిపెట్టి చేయిచూపి అడిగి గొంతెత్తి ఘోషించండి. మనందరికీ వరాలను ఇవ్వడానికే నిలిచి ఉన్న స్వామి ఆయన. 
 
తిరుమలలోని ఈ బంగారు భవనం నట్టనడుమ భాగాన అంటే ఆనంద నిలయంలోని మద్యభాగంలో బ్రహ్మస్థాన మనబడే దివ్యస్థలంలో శ్రీవారు అర్చారూపంతో స్వయం వక్తమూర్తిగా చతుర్భుజాలతో నిలిచి ఉన్నందు వల్ల ఈ మూర్తిని స్థానకమూర్తి అంటారు. ఈ మూర్తి స్థిరంగా ఉన్నందున ధృవమూర్తి అని ధృవ భేరం అని అంటారు. అంత మాత్రమే కాదు. పక్కన దేవేరులు లేకుండా తానొక్కడే వక్షస్థల మహాలక్ష్మితో నిలిచి ఉన్నందువల్ల ఈ మూర్తి స్థానక విరహమూర్తి అని కూడా పిలువడుతూ ఉన్నారు.
 
ఒక్కమాట చెబితే వక్షస్థలంపై మహాలక్ష్మిని ఉంచుకొని శ్రీ మహావిష్ణువు ఒక్కడే శ్రీ వైకుంఠాన్ని విడిచి కలియుగ వైకుంఠమైన తిరుమల కొండల్లో, కోనల్లో స్వయం వక్తమై పుట్టు శిలారూపంతో తొలుదొల్త వెలసిన ఏకైక మూలమూర్తి. ఈ ఆలయంలోని మిగిలిన మూర్తులన్నీ అనంతర కాలంలో ఆయా సమయాల్లో చేర్చబడినవి మాత్రమే. అందువల్ల తిరుమల ఆలయం ఏక బేరం ఆలయం..అంటే ఒకే ఒక్క మూర్తి కలిగిన ఆలయం మాత్రమే. కానీ శ్రీ వేంకటేశ్వరుడు పై రెండు చేతుల్లో ధరించిన శంఖు చక్రాలు మొదట స్వామివారి మూలమూర్తి అసలు స్వరూపంలో లేవని, ఆయుధ రహితుడై ఉన్న వేంకటేశ్వరునకు అనంతర కాలంలో అంటే భగవద్రామానుజుల వారు కానీ ఆ తరువాత కానీ బంగారు పూత పూయబడినరాగి రేకుతో తయారు చెయ్యబడి మూలమూర్తికి అలంకరింపబడ్డవి మాత్రమేనని చాలా మంది చెబుతుంటారు. అయినా శంఖుచక్రాలు లేనంతమాత్రాన ఈ దివ్యమూర్తి శ్రీ మహావిష్ణువు కాడని చెప్పడానికి వీల్లేదు. 
 
వక్షస్థలంలో లక్ష్మీదేవి కొలువై ఉన్నందు వల్ల తిరుమలలోని ఈ మూర్తి సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే అని ధృవీకరింపబడుతూ ఉన్నాయి.