శ్రీవారి విలువ రూ.100 కోట్లేనా? నిరూపించుకోండయ్యా..
తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ)లో జరుగుతున్న అక్రమాలపై తిరుమల పూర్వ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు తీవ్రమైన ఆరోపణలు చేశారు. అత్యంత విలువైన గులాబీ వజ్రాన్ని ఎవరు దేశం దాటించారని ఆరోపించారు. టీటీడీలో
తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ)లో జరుగుతున్న అక్రమాలపై తిరుమల పూర్వ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు తీవ్రమైన ఆరోపణలు చేశారు. అత్యంత విలువైన గులాబీ వజ్రాన్ని ఎవరు దేశం దాటించారని ఆరోపించారు. టీటీడీలో ఎప్పటినుంచో పాతుకుపోయిన సిబ్బంది వల్ల అర్చకులంటే చులకున భావన ఏర్పడిందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో రమణ దీక్షితులకు టీటీడీ నోటీసులు పంపింది.
దీనిపై బుధవారం హైదరాబాద్ ప్రెస్‌క్లబ్‌లో మీడియాతో మాట్లాడుతూ.. శ్రీవారి పరువు తీశారని ఆరోపించారు. రూ. 100 కోట్లు చెల్లించాలని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తనకు నోటీసులు పంపించారని, కోట్ల మంది కొలిచి, తమ ఇష్టదైవంగా పూజించే కలియుగ దేవదేవుని పరువు విలువ రూ. 100 కోట్లని ఎలా లెక్కగడతారన్నారు. తాను చేసిన ఆరోపణలపై నిష్పక్షపాతమైన విచారణ జరిపాల్సిందిపోయి, తనకు నోటీసులు పంపడం ఏమిటని అడిగారు.
స్వామివారికి వైఖానస ఆగమ శాస్త్ర పద్ధతుల్లో అన్ని కార్యక్రమాలూ జరుగుతున్నాయని భక్తులకు నమ్మకం కలిగించే చర్యలు ఎక్కడ తీసుకున్నారని అడిగారు. ఆరాధనలు, అభిషేకాలు, అలంకారాలు, నైవేద్యాలు సరిగ్గా జరుగుతున్నాయని నిరూపించుకోవాలని రమణ దీక్షితులు డిమాండ్ చేశారు. శ్రీవారి ఆస్తులు, తిరువాభరణాలు భద్రమని నిరూపించుకోవాలని కోరారు.
ఇలా నిరూపించుకున్నాక తాను చెప్పినవి అసత్యాలని భావిస్తే.. పరువు నష్టం దావా వేసుకోవచ్చునని సవాల్ విసిరారు. అంతేకానీ తన ఆరోపణలపైనే రూ. 100 కోట్ల పరువు నష్టం దావా వేయమని అధికారులకు ఈ సలహా ఇచ్చిన వ్యక్తిని చాలా పెద్ద బృహస్పతిగా భావిస్తున్నానని ఎద్దేవా చేశారు.