ప్రేమించే వారితోనే వివాహం జరగాలంటే.. ఆ ఆలయాన్ని దర్శించుకోండి..
దేశంలో ఎన్నో ప్రశస్తి పొందిన దేవాలయాలున్నాయి. ముఖ్యంగా తమిళనాడు రాష్ట్రంలో సుమారు 1500 దేవాలయాలకు మించి ఉండటం విశేషం. ఒక్కో దేవాలయానికి దానికంటూ ఒక ప్రత్యేకత ఉంటుంది. కొన్ని దేవాలయాలు మానసిక ప్రశాంతతకు చిహ్నంగా ఉంటే మరికొన్ని కోరికలను నెరవేర్చేవిగా ఉన్నాయి. అయితే కుంభకోణానికి ఏడు కిలోమీటర్ల దూరంలో ఉన్న తిరుశక్తిమట్టం అనే గ్రామంలో శక్తివనేశ్వర దేవాలయం ఉంది.
ఈ దేవాలయంలో శివుడు పార్వతి కలిసి శివలింగాకారంలో ఉంటారు. ఈ శివలింగం చూడటానికి చాలా విచిత్రంగా ఉంటుంది. అయితే ఈ దేవాలయం మాత్రం ఎక్కువ మంది భక్తులను ఆకర్షించే ఆలయంగా ప్రసిద్ది చెందినది. మామూలుగా శైవక్షేత్రాల్లో కంటే వైష్ణవ క్షేత్రాలకే భక్తుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. అయితే శక్తివనేశ్వర ఆలయం మాత్రం నిత్యం భక్తులతో కిటకిటలాడుతుంటుంది.
ఎందుకు తాకిడి ఎక్కువగా ఉంటుందని ఆలోచిస్తే, దానికి కారణాలున్నాయి. ప్రేమ విషయానికొస్తే ప్రేమికులు అనేక దేవాలయాలకు వెళ్లి తాము ప్రేమిస్తున్న వారితోనే వివాహాన్ని కరుణించు అని వేడుకొనుట సహజం. ఆ దేవాలయంలో స్వామి మనం ప్రేమించే వారితోనే, మనం ఇష్టపడే వారితోనే వివాహభాగ్యాన్ని ప్రసాదిస్తాడట.
ఈ దేవాలయం స్థలపురాణం చూస్తే.. పార్వతి పెరిగి పెద్దదవుతుంది. ఒక రోజు శివుడిని చూస్తుంది. అతనే తన భర్త అని భావించి ప్రతి క్షణం మహాశివుని గురించి ఆలోచిస్తూ ఉంటుంది. పార్వతి శివుని ప్రేమలోనే తన్మయత్వంతో అతనినే పెళ్లి చేసుకోవాలని నిశ్చయించుకుంటుంది. పార్వతి శివుని పెళ్లి చేసుకోవాలని ఘోరమైన తపస్సును ఆచరిస్తుంది. ఆ పార్వతి దేవి తపస్సు చేసిన స్థలమే ఇక్కడున్న దేవాలయంగా వెలసింది.
ఆ తల్లి చేసిన తపస్సు యొక్క ఫలితమే ఆ స్థలం ఇంత ప్రసిద్ధిగాంచుటకు కారణమైంది. క్రమంగా తపస్సు తీవ్రత మరింత పుంజుకుంది. ఒకే కాలిపై నిలిచి కఠినమైన తపస్సును ఆచరిస్తుంది. ఇది గమనించిన శివుడు ప్రసన్నుడవుతాడు. ప్రసన్నమైనా కూడా ప్రత్యక్షం కాలేదు. పార్వతీ దేవి మాత్రం కదలకుండా అలాగే వుంది. చివరికి శివుడు తేజోమయమైన అగ్నిరూపంలో దర్శనమిస్తాడు.
శివుణ్ణి అలా దర్శించిన పార్వతి కొంచెం కూడా భయపడకుండా ఆ అగ్నిరూపాన్నే కౌగిలించుకుంటుంది. పార్వతీ ప్రేమకు మెచ్చిన మహాశివుడు తన నిజ రూపంలో ప్రత్యక్షమై పార్వతిదేవిని వివాహం చేసుకుంటాడు.ఈ విధంగా ఆదిశక్తియైన పార్వతి దేవి తాను ఇష్టపడిన శివుని తన పతిగా దక్కించుకుంటుంది. అదే విధంగా ఈ దేవాలయానికి వచ్చి శ్రద్ధ, భక్తితో శివుని ఆరాధించినవారికి వారు ఇష్టపడి ప్రేమించినవారిని ప్రసాదిస్తారు. ఇక్కడి శివలింగం కథలో చెప్పినట్లుగానే కనపడుతుంది. అంటే ఇక్కడున్న శివలింగాన్ని పార్వతీదేవి గట్టిగా కౌగిలించుకున్నట్లుగా కనిపిస్తుంది.