శనివారం, 11 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. వార్తలు
Written By జె
Last Modified: సోమవారం, 2 నవంబరు 2020 (23:18 IST)

200 రోజుల తరువాత శ్రీవారి ఉత్సవమూర్తులు ఆలయం నుంచి బయటకు...

కరోనావైరస్ కారణంగా తిరుమల వేంకటేశ్వరస్వామి సేవలన్నీ ఏకాంతంగా జరుగుతున్నాయి. ముఖ్యంగా బ్రహ్మోత్సవాలనే ఆలయం లోపల టిటిడి నిర్వహించింది. అంతకుముందు ఎన్నో సేవలను పరిమితం చేసింది. కానీ ప్రస్తుతం ప్రయోగాత్మకంగా ఒక్కొక్కటిని అమలు చేస్తోంది టిటిడి.
 
అందులో భాగంగా తిరుమ‌ల శ్రీ వేంక‌టేశ్వ‌ర‌స్వామివారి ఆల‌యంలో నిర్వ‌హించే డోలోత్స‌వం, ఆర్జిత బ్ర‌హ్మోత్స‌వం, స‌హ‌స్ర‌దీపాలంకార‌ సేవ‌ల‌ను భ‌క్తుల కోరిక మేర‌కు ప్ర‌యోగాత్మ‌కంగా ఆదివారం నుండి టిటిడి ప్రారంభించింది. కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాల కోవిడ్‌-19 మార్గ‌ద‌ర్శ‌కాల మేర‌కు భ‌క్తుల ఆరోగ్య భ‌ద్ర‌త‌ను దృష్టిలో ఉంచుకుని శ్రీ‌వారి ఆర్జిత సేవ‌ల‌ను టిటిడి ఏకాంతంగా నిర్వ‌హిస్తున్నవిష‌యం తెలిసిందే.
 
ఇందులో భాగంగా స్వామివారి ఆర్జిత బ్ర‌హ్మోత్స‌వం, డోలోత్స‌వం, స‌హ‌స్ర ‌దీపాలంకార‌ సేవా టికెట్ల‌ను ఆన్‌లైన్ వర్చ్యువల్ సేవ‌గా న‌వంబ‌రు రెండ‌వ వారం నుండి భ‌క్తుల‌కు అందుబాటులో ఉంచేందుకు టిటిడి చ‌ర్య‌లు చేప‌ట్టింది. ఈ సేవ‌లు పొందిన భ‌క్తులకు ఆ టికెట్టుపై శ్రీ‌వారి ద‌ర్శ‌నం ఉండ‌దు. దర్శనం పొంద దలచిన గృహ‌స్తులు శ్రీ‌వారి ద‌ర్శ‌నం కొర‌కు ప్ర‌త్యేక‌ ద‌ర్శ‌న టికెట్లు ఆన్ లైన్ లో పొందవలసి ఉంటుంది. ఆల‌యంలో ఏకాంతంగా నిర్వ‌హించే ఈ ఉత్స‌వాల‌ను ఎస్వీబీసీలో ప్ర‌త్య‌క్ష ప్ర‌సారం చేయ‌నున్నారు. 
                 
ముఖ్యంగా స్వామివారి ఉత్సవమూర్తులు సుమారు 200రోజుల తరువాత బయటకు రావడంతో భక్తులు గోవిందనామస్మరణలు చేసుకుంటూ ఆ స్వామివారిని దర్సించుకున్నారు.