గురువారం, 26 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. వార్తలు
Written By జె
Last Modified: మంగళవారం, 16 ఫిబ్రవరి 2021 (21:15 IST)

తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం

తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆల‌యంలో ఫిబ్ర‌వ‌రి 19న ర‌థ‌స‌ప్త‌మి ప‌ర్వ‌దినాన్ని పురస్కరించుకొని మంగ‌ళ‌వారం కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం ఘనంగా జ‌రిగింది. ఇందులో భాగంగా ఉదయం సుప్రభాతంతో అమ్మవారిని మేల్కొలిపి ఉదయం 6.30 నుండి 9 గంటల వరకు కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం చేపట్టారు.
 
ఇందులో ఆలయ ప్రాంగణం, గోడలు, పైకప్పు, పూజాసామగ్రి తదితర అన్ని వస్తువులను నీటితో శుద్ధి చేశారు. అనంతరం నామకోపు, శ్రీచూర్ణం, కస్తూరి పసుపు, పచ్చాకు, గడ్డ కర్పూరం, గంధం పొడి, కుంకుమ, కిచీలీగడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్ర జలాన్ని ఆలయం అంతటా ప్రోక్షణం చేశారు. అనంత‌రం భ‌క్తుల‌కు స‌ర్వ‌ద‌ర్శ‌నం క‌ల్పించారు.
 
ఫిబ్ర‌వ‌రి 19న తిరుచానూరులో ర‌థ‌స‌ప్త‌మి..వాహనసేవలు ఏంటో తెలుసా..?
ఫిబ్రవరి 19వ తేదీన సూర్యజయంతిని పురస్కరించుకుని రథసప్తమి పర్వదినాన  తిరుచానూరు శ్రీ పద్మావతీ అమ్మవారు ఏడు ప్రధాన వాహనాలపై ఊరేగి భక్తులను అనుగ్రహించనున్నారు. ప్రతియేడాది రథసప్తమి నాడు వాహనసేవలను నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది.  
 
ఇందులో భాగంగా ఉదయం 19వతేదీ ఉదయం 7.30 -  ఉ. 8.30 సూర్యప్రభ వాహనం
ఉ. 9.00 -  ఉ. 10.00 హంస వాహనం,
ఉ. 10.30 - ఉ. 11.30 అశ్వ వాహనం,
మ. 12.00 - మ. 1.00 గరుడ వాహనం,
మ. 1.30 -  మ. 2.30  చిన్నశేష వాహనం,
సా. 6.00 -  రా. 7.00 చంద్రప్రభ వాహనం,
రా. 8.30 -  రా. 9.30 గజ వాహనం. 
 
కాగా సాయంత్రం 3.30 నుండి 4.30 గంటల వరకు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలోని శ్రీ కృష్ణస్వామివారి ముఖ మండపంలో అమ్మవారి ఉత్సవర్లకు స్నపనతిరుమంజనం వైభవంగా నిర్వహిస్తారు. ఈ సందర్భంగా అమ్మవారి ఆలయంలో నిర్వహించే ఆర్జిత కల్యాణోత్సవం, ల‌క్ష్మీపూజ‌, ఊంజలసేవ, బ్రేక్‌ దర్శనాలను టిటిడి రద్దు చేసింది.
 
శ్రీవారి సర్వదర్శనం భక్తులకు విజ్ఞప్తి..!
తిరుమల శ్రీవారి దర్శనం కోసం తిరుపతిలోని భూదేవి కాంప్లెక్స్, విష్ణునివాసం కౌంటర్లలో ఆఫ్ లైన్ విధానంలో జారీ చేస్తున్న సర్వదర్శనం టైం స్లాట్ టోకెన్లకు సంబంధించి ప్రస్తుతం ఫిబ్రవరి 18వ తేదీ స్లాట్ నడుస్తోంది. 
 
ఆ తరువాత యధావిధిగా తదుపరి తారీఖుల  స్లాట్ టోకెన్లు జారీ చేస్తారు. దర్శన టోకెన్లు గల భక్తులను మాత్రమే ఒక రోజు ముందుగా తిరుమలకు అనుమతించడం జరుగుతుంది. రథసప్తమి పర్వదినానికి వచ్చే భక్తులు ఈ విషయాలను దృష్టిలో ఉంచుకుని తమ తిరుమల యాత్ర ప్రణాళిక రూపొందించుకోవాలని టిటిడి విజ్ఞప్తి చేయడమైనది.
 
విపరీతంగా పెరుగుతున్న భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని టిటిడి ఈ నిర్ణయం తీసుకుంది. తిరుమల యాత్రకు వచ్చే భక్తులందరూ తప్పనిసరిగా టిటిడి చేస్తున్న ప్రకటనలను ప్రసార మాథ్యమాల ద్వారా లేకుంటే సామాజిక మాథ్యమాల ద్వారా తిలకించాలని కూడా టిటిడి అధికారులు కోరుతున్నారు.