ఆదివారం, 1 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. ప్రేమాయణం
  3. మధుర జ్ఞాపకాలు
Written By ivr
Last Modified: బుధవారం, 3 ఫిబ్రవరి 2016 (16:43 IST)

ఆమెతో గడిపిన ఆ జ్ఞాపకాలు మర్చిపోలేకపోతున్నా... ఆమె ఎందుకలా చేస్తుందీ...?

గత ఏడాదిగా ఓ అమ్మాయితో నాకు పరిచయం ఉంది. మేమిద్దరం యూనివర్శిటీలో చదువుతున్నాం. నాకు ఇంతకుముందు గర్ల్ ఫ్రెండ్ లేరు. యూనివర్శిటీకి వచ్చాక అనుకోకుండా ఈమెతో పరిచయం ఏర్పడింది. ఇక అప్పట్నుంచీ మా పేరెంట్సుతోనైనా మాట్లాడకుండా ఉన్నానేమో కానీ ఆమెతో ఒక్కరోజు కూడా మాట్లాడకుండా లేను. అంతగా ఆమెతో ఎట్రాక్ట్ అయిపోయాను. ఇద్దరం సినిమాలకు, సాయంత్రం వేళల్లో పబ్బులకూ వెళ్లాము కూడా. ఇలా ఆమె-నేను చాలా క్లోజ్ అయిపోయాం. ఈమధ్య హఠాత్తుగా ఆమె బాంబులాంటి వార్త చెప్పింది. 
 
తను ఓ యువకుడితో ప్రేమలో పడిందట. అతడిని పెళ్లిచేసుకోవాలనుకుంటున్నట్లు చెప్పింది. అదేంటి.. నేను నిన్ను చేసుకోవాలనుకున్నాను. నువ్వు-నేను చాలా క్లోజయ్యాం కదా అని అడిగితే... నేనలా ఎప్పుడూ భావించలేదని చెప్పి వెళ్లిపోయింది. అదేరోజు రాత్రి... కోపమొచ్చిందా అంటూ లాలనగా మాట్లాడింది. మనిద్దరి స్నేహం ఇలాగే ఉండాలి. ఎప్పటికీ ఒకరికొకరు మర్చిపోకూడదంటూ చెప్తోంది. ఆమె నాకు అర్థం కావడంలేదు. నన్నెందుకు వద్దనుకుని వేరేవాడిని పెళ్లాడాలనుకుంటుంది...?
 
ఆమే చెప్పింది కదా... మిమ్మల్ని ఆ భావనలో చూడలేదని. అలాగే మీరు కూడా ఆమె వేరే యువకుడిని ప్రేమిస్తున్నాననీ, పెళ్లి చేసుకుంటానని చెప్పేవరకూ మీ మనసులో ఉన్నదేమిటో చెప్పలేదు కదా. అందువల్ల మీరు తన పట్ల స్నేహపూర్వకంగా మాత్రమే ఉంటున్నారని అనుకుని ఉండవచ్చు. కాబట్టి జరిగిందేదో జరిగిపోయింది. ఆమె అనుకుంటున్నట్లే మీరు మంచి స్నేహితుడిగా ఉండిపోవడం మంచిది. ఇక మధుర జ్ఞాపకాలంటూ ఆమెతో కలిసి వెళ్లిన సమయాలను గుర్తు చేసుకుని సమయాన్ని వృధా చేసుకోవద్దు.