సోమవారం, 25 నవంబరు 2024
  1. క్రీడలు
  2. ఇతర క్రీడలు
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 9 డిశెంబరు 2019 (16:59 IST)

రష్యాకు తేరుకోలేని షాకిచ్చిన 'వాడా' .. నాలుగేళ్ళ నిషేధం

రష్యాకు ప్రపంచ డోపింగ్ వ్యతిరేక సంస్థ (వాడా) తేరుకోలేని షాకిచ్చింది. ఒలింపిక్స్ క్రీడలతో పాటు.. అన్ని ప్రపంచ స్థాయి చాంపియన్‌షిప్ పోటీల్లో పాల్గొనకుండా నిషేధం విధించింది. డోపింగ్ వివరాలు బయటికి పొక్కకుండా లాబొరేటరీ డేటాను తారుమారు చేసినందుకుగానూ డబ్ల్యూఏడీఏ ఈ మేరకు సంచలన నిర్ణయం తీసుకుంది. 
 
ముఖ్యంగా, డోప్ టెస్టుల్లో పట్టుబడిన తమ దేశ క్రీడాకారుల వివరాలు బయటపడకుండా ఉండేందుకు తప్పుడు ఆధారాలు చొప్పించడంతో పాటు... పాజిటివ్‌గా వచ్చిన డోపింగ్ టెస్టులకు సంబంధించిన ఫైళ్లను డిలీట్ చేసినట్టు నిర్ధారణ కావడంతో డబ్ల్యూఏడీఏ ఎగ్జిక్యూటివ్ కమిటీ ఈ కఠిన నిర్ణయం తీసుకుని, రష్యాపై వేటు వేసింది. 
 
పాజిటివ్‌గా తేలిన డోపింగ్ టెస్టు నివేదికలు డ్రగ్స్ మోసాలను బయటపెట్టేందుకు సహాయపడతాయి. వీటిని లేబరేటరీ డేటా నుంచి తొలగించినందుకుగానూ నాలుగేళ్ల పాటు రష్యాపై నిషేధం విధించారు. 
 
కాగా రష్యాపై నిషేధం విధించేందుకు డబ్ల్యూఏడీఏ సభ్యులంతా ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకున్నట్టు సంస్థ ప్రతినిధి ఒకరు వెల్లడించారు. తాజా నిర్ణయంతో రష్యా ఒలింపిక్స్‌తో పాటు 2020 సమ్మర్ గేమ్స్, బీజింగ్‌లో జరిగే 2022 వింటర్ గేమ్స్ తదితర ప్రపంచ క్రీడలకు దూరంగా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది.