కృష్ణాష్టమి : వ్రతం ఆచరిస్తే గోదానం చేసిన ఫలమట!
కృష్ణాష్టమి నాడు భక్తులు పగలంతా ఉపవాసం ఉండి, సాయంకాలం శ్రీకృష్ణుని పూజిస్తారు. శ్రావణ మాసంలో లభించే పళ్ళు, శొంఠి, బెల్లం కలిపిన వెన్న, పెరుగు, మీగడ స్వామికి నైవేద్యం పెడతారు. ఊయలలు కట్టి అందులో శ్రీకృష్ణ విగ్రహాల్ని పడుకోబెట్టి ఊపుతూ రకరకాల పాటలు, కీర్తనలు పాడతారు.
పుర వీధుల్లో ఎత్తుగా ఉట్లు కట్టి పోటీపడి వాటిని కొడతారు. అందుకే ఈ పండుగని 'ఉట్ల పండుగ' లేదా 'ఉట్ల తిరునాళ్ళు' అని పిలుస్తారు. భక్తిశ్రద్ధలతో శ్రీకృష్ణ జయంతి వ్రతంగా ఆచరిస్తే గోదానం చేసిన ఫలితం, కురుక్షేత్రంలో సువర్ణదానం చేసిన ఫలం దక్కుతుందని బ్రహ్మాండ పురాణం చెప్పింది. కలియుగంలో కల్మషాల్ని హరించి, పుణ్యాల్ని ప్రసాదించే పర్వదినం ఇదని కూడా వివరించింది.
"ఓ అర్జునా! ధర్మమునకు హాని కలిగినప్పుడు అధర్మము పెచ్చుపెరిగినప్పుడును నన్ను నేను సృజించుకొందును. అనగా సాకార రూపముతో లోకమున నేను అవతరింతును" అని చెప్పియున్నాడు. అందుచేత శ్రీకృష్ణాష్టమి రోజున వ్రతమాచరించి నిష్ఠతో ఆ దేవదేవుడిని పూజించే వారికి సకల సంపదలు చేకూరుతాయని పండితులు అంటున్నారు.