శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు 2018
Written By
Last Updated : ఆదివారం, 25 నవంబరు 2018 (13:08 IST)

ప్రజాకూటమి గెలిస్తే సీఎం ఎవరు ? నందమూరి సుహాసినికి మంత్రి పదవి...

తెలంగాణలో టీఆర్ఎస్ గెలిస్తే కేసీఆరే సీఎం. ఇందులో సందేహమే లేదు. ముందు ఆర్నెల్లు ముఖ్యమంత్రిగా ఉండి  పార్లమెంట్ ఎన్నికల్లో పోటీచేసి సీఎం కుర్చీలో కేటీఆర్‌ను కూర్చోపెట్టి కేసీఆర్ సార్ హస్తినకు వెళ్లే ఆలోచనలో ఉన్నట్టు ప్రచారం జోరుగా సాగుతోంది.
 
మరి నాలుగు పార్టీల నేతలు కలిసి ఓ కూటమిగా ఏర్పడిన ప్రజాకూటమి రాష్ట్రంలో అధికారంలోకి వస్తే ఆకూటమి తరపున ముఖ్యమంత్రి ఎవరన్నది ఇప్పుడు అందరి మదిని తొలుస్తున్న ప్రశ్న.
 
ఈ ప్రశ్న కాంగ్రెస్ పార్టీని కూడా లోలోపల వణికిస్తోంది. ఇన్నాళ్లూ పార్టీని నడిపిస్తూ చైతన్య యాత్రలు పేరుతో తెలంగాణ రాష్ట్రమంతటా బస్సులో పర్యటించిన టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యే అవకాశలున్నాయా? కాంగ్రెస్‌లో తలపండిన జైపాల్ రెడ్డి, జానారెడ్డి, రేణుకా చౌదరి, వీహెచ్ లాంటి నేతలు ఉత్తమ్ కుమార్ రెడ్డిని సీఎం అభ్యర్థిగా సమర్థిస్తారా అనేది ఇక్కడ ప్రశ్న. 
 
అయితే ఇప్పటికే జానారెడ్డి తాను సీఎం రేసులో ఉన్నట్టు తన మనుసలో మాట బయటపెట్టారు. తెలంగాణ కాంగ్రెస్ కార్యనిర్వహక అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కూడా తనకు ప్రత్యర్ధులను విమర్శించడమే కాదు, తనకు విజన్ కూడా ఉందని, ప్రకటించడంతో కాంగ్రెస్‌లో కలకలం రేపింది. అందులో భాగంగానే ముఖ్యమంత్రి రేసులో ప్రజాకూటమి నుంచి  చాలామంది ఉన్నారనే ప్రచారం జోరందుకుంది. 
 
అయితే సీనియర్ నేత జైపాల్ రెడ్డి సీఎం రేసులో తాను మాత్రం లేనని, దానికి పార్టీలో యువకులు చాలామంది ఉన్నారని  ప్రకటించారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ బలంగా ఉందని, అధికారంలోకి రావడమే ప్రథమ లక్ష్యమని చెప్పారు. తాను ముఖ్యమంత్రి రేసులో ఉన్నానంటూ వస్తున్న వార్తల్లో నిజం లేదన్నారు. ముఖ్యమంత్రిని అధిష్టానమే నిర్ణయిస్తుందని క్లారిటీ ఇచ్చారు. 
 
ఇదిలా ఉంటే ప్రజాకూటమి అధికారంలోకి వస్తే తప్పకుండా నందమూరి సుహాసినిని మంత్రి వర్గంలోకి తీసుకుంటామని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు సర్వే సత్యనారాయణ తెలియజేశారు. కూకట్‌పల్లిలో ప్రజాకూటమి తరపున ప్రచారం చేసిన సర్వే సత్యనారాయణ ఈ వ్యాఖ్యలు చేశారు.