శుక్రవారం, 3 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 11 డిశెంబరు 2023 (09:43 IST)

గూగుల్ మ్యాప్‌పై అతి విశ్వాసం.. రిజర్వాయర్‌లోకి డీసీఎం - ప్రాణాలతో బయటపడిన డ్రైవర్

google map
ఇటీవలికాలంలో అనేక మంది తమకు తెలియని ప్రదేశాలకు వెళితే తాము చేరుకోవాల్సిన గమ్యస్థానాల చిరునామా కోసం గూగుల్ మ్యాప్‌పై ఆధారపడుతున్నారు. అనేక సందర్భాల్లో ఈ మ్యాప్ సక్రమంగానే పనిచేస్తుంది. కానీ, కొన్ని సందర్భాల్లో మాత్రం బోల్తా కొట్టిస్తుంది. తాజాగా గూగుల్ మ్యప్‌ను నమ్ముకున్న ఓ డ్రైవర్ నట్టేట మునిగాడు. అర్థరాత్రి వేళ గూగుల్ మ్యాప్స్ రూట్లో డీసీఎం వాహనంలో వెళ్లడంతో చివరకు అది గౌరవెల్లి రిజర్వాయర్‌ వద్దకు చేరుకుంది. దీంతో జరగబోయే ప్రమాదాన్ని డ్రైవర్ చివరి నిమిషంలో గుర్తించడంతో ప్రాణాపాయం తప్పింది. డీసీఎంలోని డ్రైవర్, సిబ్బందిని స్థానికులు కాపాడారు.
 
ఈ ఘటన తెలంగాణ రాష్ట్రంలో వెలుగు చూసింది. ఈ వివరాలను పరిశీలిస్తే, హన్మకొండ నుంచి మిల్క్ ప్యాకెట్ల లోడుతో ఓ డీసీఎం హుస్నాబాద్‌కు బయలుదేరింది. అక్కడ డెలివరీ పూర్తి చేశాక రాత్రి 10 గంటలకు చేర్యాల మీదుగా హైదరాబాద్ వైపు బయలుదేరింది. గూగుల్ మ్యాప్స్ చూపించిన రూట్లో డ్రైవర్ వాహనం నడిపాడు.
 
అయితే, నందారం స్టేజీ వద్ద కుడివైపు మలుపు చూపించాల్సిన మ్యాప్స్ ఎడమవైపు చూపించడంతో డీసీఎం నేరుగా గౌరవెల్లి రిజర్వాయర్ నీటిలోకి వెళ్లిపోయింది. గూగుల్ మ్యాప్‌ను నమ్మిన డ్రైవర్ రోడ్డుపై వాన నీరు నిలిచి ఉందని భావించి రిజర్వాయర్‌లోకి పోనిచ్చాడు. అయితే, అంతకంతకూ లారీ నీళ్లల్లోకి దిగబడిపోతుండటంతో తప్పుడు రూట్లో ప్రయాణిస్తున్నామని డ్రైవర్ గ్రహించి వాహనాన్ని వెంటనే నిలిపివేశాడు. 
 
అనంతరం, లారీ డ్రైవర్, ఇతర సిబ్బంది ఆర్తనాదాలు చేయగా దాదాపు రెండు గంటల తర్వాత స్థానికులు వారిని గుర్తించి బయటకు తీసుకొచ్చారు. మర్నాడు ఉదయం డీసీఎంను బయటకు తీశారు. డ్రైవర్ డీసీఎంను మరికొంతముందుకు పోనిచ్చి ఉంటే అందరూ మరణించి ఉండేవారని స్థానికులు చెబుతున్నారు. గతంలో ఇలాంటి సంఘటనలు పలు చోటు చేసుకున్న విషయం తెల్సిందే.