ఆదివారం, 10 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 6 డిశెంబరు 2023 (22:22 IST)

తెలంగాణ ఎమ్మెల్యేల్లో కోటీశ్వరుల జాబితాలో మొదటి స్థానం ఎవరిది?

vivek
తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీకి తాజాగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అనేక మంది ఎమ్మెల్యేలు కోటీశ్వరులుగా ఉన్నారు. పలువురు ఎమ్మెల్యేల ఆస్తులు రూ.100 కోట్లకు పైమాటగానే ఉంది. మరికొందరికి రూ.50 కోట్లకు పైగా ఉంది. అయితే, వివెక్ వెంకటస్వామి ఆస్తులు రూ.600 కోట్లుగాను, కోమటిరెడ్డి బ్రదర్స్‌లలో ఒకరైన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆస్తి దాదాపుగా 450 కోట్ల రూపాయలకు పైగా ఉంది. అలాగే, మరో బడా ఎమ్మెల్యే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆస్తులు కూడా ఇంచుమించుగా ఇదే స్థాయిలో ఉన్నాయి. 
 
అసెంబ్లీకి ఎన్నికైన మొత్తం 119 మంది ఎమ్మెల్యేల్లో ఆరుగురి ఎమ్మెల్యేల ఆస్తులు రూ.100 కోట్లకు పైగా ఉండగా, అందరికంటే అత్యధిక ఆస్తులను కలిగిన కాంగ్రెస్ ఎమ్మెల్యేల్లో జి.వివేక్ వెంకటస్వామి మొదటి స్థానంలో ఉన్నారు. ఈయన ఆస్తులు రూ.606 కోట్లతో మొదటి స్థానంలో ఉన్నారు. ఈ మేరకు ఆయన ఎన్నికల సంఘానికి సమర్పించిన అఫిడవిట్‌లో పేర్కొన్నారు. 
 
ఆ తర్వాత కోటమిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆస్తులు రూ.458 కోట్లుగాను, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆస్తులు రూ.434 కోట్లుగాను, పి.సుధాకర్ రెడ్డి ఆస్తులు రూ.102 కోట్లు కలిగివున్నారు. వీరంతా కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచారు. మెదక్ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి తన ఆస్తులు రూ.100 కోట్లు, కుటుంబ ఆస్తులు రూ.197 కోట్లుగా ప్రకటించుకున్నారు. 
 
మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి రూ.95.93 కోట్ల ఆస్తులు ఉన్నట్టు ప్రకటించారు. మల్లారెడ్డి అల్లుడు మర్రి రాజశేఖర్ రెడ్డి ఆస్తులు రూ.97 కోట్లుగాను, అరికెపూడి గాంధీ ఆస్తులు రూ.85 కోట్లుగాను ఉన్నట్టు చూపించారు. బీఆర్ఎస్ ఉప్పల్ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి రూ.85 కోట్లుగా ప్రకటించారు. రూ.100 కోట్లకు పైగా ఆస్తులను ఆరుగురు ఎమ్మెల్యేలు ప్రకటించగా, 16 మంది ఎమ్మెల్యేలు మాత్రం రూ.50 నుంచి  రూ.100 కోట్ల మధ్య తమ ఆస్తులు ఉన్నట్టు తెలిపారు.