గురువారం, 19 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ ఎన్నికలు 2023
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 3 డిశెంబరు 2023 (16:32 IST)

ప్రగతి భవన్... ఇక డాక్టర్ అంబేద్కర్ ప్రజా భవన్ : రేవంత్ రెడ్డి

revanth reddy
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారక నివాసంగా ఉన్న ప్రగతి భవన్ పేరును మార్చనున్నట్టు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ప్రకటించారు. తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది. దీంతో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కానున్నారు. ఈ నేపథ్యంలో ఆయన ఆదివారం హైదరాబాద్ గాంధీ భవన్‌లో విలేకరులతో మాట్లాడుతూ, డిసెంబరు 9వ తేదీన తెలంగాణాలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటవుతుందన్నారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రగతి భవన్ పేరును బాబా సాహెబ్ డాక్టర్ అంబేద్కర్ భవన్‌గా పేరు మారుస్తామని తెలిపారు. 
 
అలాగే, భారత రాష్ట్ర సమితి కూడా ప్రధాన ప్రతిపక్షంగా, బాధ్యతాయుతమైన పాత్రను పోషించాలని కోరారు. భారతీయ జనతా పార్టీతో పాటు.. ఎంఐఎం, సీపీఐ, సీపీఎం పార్టీలు కూడా రాష్ట్ర అభివృద్ధికి తగిన సూచనలు సలహాలు ఇవ్వాలని కోరారు. మరోవైపు, ఈ ఎన్నికల్లో రెండు చోట్ల పోటీ చేసిన రేవంత్ రెడ్డి ఒక చోట ఓడిపోయారు. కామారెడ్డిలో ఓడిపోయిన ఆయన తన సొంతూరు కొడంగల్‌లో విజయం సాధించారు. ఈ స్థానంలో పోటీ చేసిన సీఎం కేసీఆర్ మూడో స్థానానికి పరిమితమయ్యారు. ఇక్కడ బీజేపీ అభ్యర్థి విజయం సాధించారు. 

కాంగ్రెస్‌ పార్టీ విజయాన్ని తెలంగాణ అమరవీరులకు అంకితమిస్తున్నట్టు తెలిపారు. కాంగ్రెస్‌ పార్టీ ఘన విజయం సాధించిన సందర్భంగా ఆయన హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడారు. సోనియా గాంధీకి కృతజ్ఞతలు తెలిపే అవకాశాన్ని కాంగ్రెస్‌ నాయకులకు ఇచ్చినందుకు తెలంగాణ ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. ప్రజల ఆశయాలు, ఆకాంక్షలను అమలు చేయడానికి ఈ తీర్పు ద్వారా కాంగ్రెస్‌ పార్టీ బాధ్యతను మరింత పెంచారు. 
 
ఈ డిసెంబరు 3న తెలంగాణ ప్రజలు ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించారు. భారత్‌ జోడో యాత్ర తెలంగాణలో 21 రోజుల పాటు సాగింది. రాష్ట్ర ప్రజలకు ఏ కష్టమొచ్చిన అండగా ఉంటామని రాహుల్‌గాంధీ భరోసా ఇచ్చారు. తనను, భట్టి విక్రమార్కను రాహుల్‌ ఎంతో ప్రోత్సహించారు.
 
సోనియాగాంధీ, రాహుల్‌గాంధీ, ప్రియాంక గాంధీలకు తెలంగాణతో కుటుంబ అనుబంధం ఉంది. పార్టీ సీనియర్‌ నేతలు భట్టి విక్రమార్క, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, శ్రీధర్‌బాబు, హనుమంతరావు తదితర నేతల సహకారంతోనే కాంగ్రెస్‌ విజయం సాధించింది. ఆచార్య  కోదండరామ్‌ సలహాలు, సూచనలు తీసుకుని ముందకెళ్తాం. కాంగ్రెస్‌ గెలుపును ప్రజలు విస్పష్టమైన తీర్పు ఇచ్చారు. కాంగ్రెస్‌ గెలుపును కేటీఆర్‌ స్వాగతించారు. వారి స్పందనను  స్వాగతిస్తున్నా. ప్రతిపక్ష పార్టీగా భారాస సహకరిస్తుందని ఆశిస్తున్నా. ఇక నుంచి ప్రగతి భవన్‌.. ప్రజా భవన్‌ అవుతుంది అని రేవంత్ రెడ్డి తెలిపారు.