గురువారం, 19 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ ఎన్నికలు 2023
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 3 డిశెంబరు 2023 (14:00 IST)

తెలంగాణ రాష్ట్ర ఫలితాల ఎఫెక్ట్ : రేవంత్‌ రెడ్డిని కలిసి డీజీపీ, ఇతర పోలీస్ ఉన్నతాధికారులు

anjanikumar revanth reddy
తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ఫలితాలు ఆదివారం ఉదయం నుంచి వెలువడుతున్నాయి. ఈ ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రానుందనే సంకేతాలు తేటతెల్లం చేశాయి. దీంతో తెలంగాణ రాష్ట్ర డీజీవీ అంజని కుమార్ యాదవ్ ఇతర పోలీస్ ఉన్నతాధికారులు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని కలిసి అభినందనలు తెలిపారు. 
 
ఈ నెల 30వ తేదీన పోలింగ్ జరిగింది. ఆదివారం ఉదయం నుంచి ఓట్ల లెక్కింపు మొదలైంది. ఈ లెక్కింపులో కాంగ్రెస్ పార్టీకి స్పష్టమైన మెజారిటీ వస్తుందని తేలిపోయింది.దీంతో రేవంత్ రెడ్డిని కలిసేందుకు పార్టీ నేతలు క్యూ కడుతున్నారు. తెలంగాణ డీజీపీ అంజనీ కుమార్ యాదవ్, తన సహోద్యోగులతో కలిసి రేవంత్ రెడ్డి నివాసానికి చేరుకుని, ఆయనకు పుష్పగుచ్ఛం ఇచ్చిచ అభినందనలు తెలిపారు. రేవంత్‌ను కలిసిన వారిలో సీఐడీ చీఫ్ మహేశ్ భగవత్ కూడా ఉన్నారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 
 
మరోవైపు, ఓట్ల లెక్కింపు ఉదయం 10 గంటల నుంచి మొదలుకాగా, రేవంత్ రెడ్డి ఇంటికి ఉదయం పది గంటల నుంచి కాంగ్రెస్ కార్యకర్తలు పోటెత్తారు. కార్యకర్తల తాకిడి నేపథ్యంలో ట్రాఫిక్ పోలీసులు కూడా పెద్ద సంఖ్యలో రేవంత్ రెడ్డి ఇంటికి చేరుకుని భద్రతను పెంచారు. మొత్తం 119 స్థానాలకు గాను కాంగ్రెస్ పార్టీ 70కి పైగా సీట్లను కైవసం చేసుకోనుంది.