తెలంగాణాలో జేఎన్.1 సబ్ వేరియంట్‌ను గుర్తించారా? ఆయన ఏమన్నారు?
రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒకటైన తెలంగాణాలో గత కొన్ని రోజులుగా కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. ముఖ్యంగా, కరోనా కొత్త వేరియంట్ జేఎన్.1 సబ్ వేరియంట్‌ను కూడా గుర్తించినట్టు ప్రచారం జరిగింది. దీనిపై ఆ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ డైరెక్టర్ రవీంద్రనాయక్ ఓ క్లారిటీ ఇచ్చారు. ఇదే అంశంపై ఆయన సోమవారం ఓ ప్రకటన చేశారు. మన రాష్ట్రంలో ఇప్పటివరకు కోవిడ్ జేఎన్.1 సబ్ వేరియంట్ కేసులు నమోదు కాలేదని క్లారిటీ ఇచ్చారు. ప్రజలు ఎవరూ ఆందోళన చెందనక్కర్లేదని చెప్పారు. అయితే, అప్రమత్తంగా ఉండాలని మాత్రం ఆయన సూచించారు.
మరోవైపు, గడిచిన 24 గంటల్లో 989 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా, 10 మందికి కరోనా వైరస్ సోకినట్టు తేలింది. ఈ మేరకు వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన బులిటెన్‌లో పేర్కొంది. కొత్తగా నమోదైన కేసుల్లో హైదరాబాద్ 9, కరీంనగర్‌లో 1 చొప్పున నమోదయ్యాయి. ఒక్క రోజు వ్యవధిలో ఈ మహమ్మారి నుంచి ఒకరు కోలుకోగా, మరో 55 మంది ఐసోలేషన్‌లో ఉన్నట్టు తెలిపింది. మరో 12 మందికి రిపోర్టులు రావాల్సి ఉందని ఆయన పేర్కొన్నారు.
నేడు ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి - ప్రధాని నరేంద్ర మోడీతో భేటీ
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంగళవారం (డిసెంబరు 26)న ఢిల్లీకి వెళుతున్నారు. ఈ పర్యటనలో ఆయన ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో సమావేశమవుతారు. బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో ఆయన హస్తినకు చేరుకుంటారు. ఢిల్లీకి చేరుకున్న తర్వాత ఆయన తొలుత ప్రధాని మోడీతో భేటీ కానున్నారు. ఈ సందర్భంగా తెలంగాణాకు సంబంధించి అనేక అంశాలపై చర్చించే అవకాశం ఉంది.
సాధారణంగా రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి వెళ్లి ప్రధాన మంత్రిని కలవడమన్నది సంప్రదాయం. దీన్ని రేవంత్ కూడా కొనసాగించనున్నారు. వాస్తవానికి రాజకీయ వైరుధ్యాలతో సంబంధం లేకుండా.. కేంద్ర ప్రభుత్వంతో పాలనా పరమైన సఖ్యతను సీఎం రేవంత్‌రెడ్డి ఆశిస్తున్నారు. ఈ మేరకు గతంలోనే కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డికి స్వయంగా ఫోన్ చేసి తాను మర్యాదపూర్వకంగా కలిసేందుకు ప్రధాని మోడీ వెసులుబాటు గురించి ఆరా తీశారు.
ఈ నెల 26 (మంగళవారం) సాయంత్రం 4 గంటలకు కలిసేందుకు ప్రధాని సమయం ఇచ్చారు. కాగా, ప్రధానితో సీఎం భేటీ మర్యాదపూర్వకమేనన్న అభిప్రాయాలున్నప్పటికీ.. ఈ సందర్భంగా రేవంత్ రాష్ట్ర ప్రయోజనాలను మోడీ దృష్టికి తీసుకెళతారని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. ముఖ్యంగా 'ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం-2014'లో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలతోపాటు ఇతర హామీలను నెరవేర్చాలని కోరనున్నారు.
ప్రధానితో భేటీ ముగిసిన తర్వాత కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకులతో సమావేశమవుతారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఏర్పాటైన తర్వాత ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారెంటీల అమలు, తెలంగాణ అప్పులు, ఆస్తులు, మంత్రివర్గ విస్తరణ తదితర అంశాలపై సీఎం రేవంత్ రెడ్డి దృష్టిసారించిన విషయం తెల్సిందే.