బీజేపీకిషాక్!.. కాంగ్రెస్ గూటికి చేరనున్న రాములమ్మ?
తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీకి చెందిన కీలక నేతలు ఒక్కొక్కరుగా పార్టీని వీడుతున్నారు. ఇప్పటికే అనేక మంది నేతలు బీజేపీకి టాటా చెప్పేశారు. ఇపుడు ఆ పార్టీ మహిళా సీనియర్ నేత, సినీ నటి విజయశాంతి కూడా బీజేపీని వీడుతున్నారంటూ ప్రచారం సాగుతుంది.
ఈ అసెంబ్లీ ఎన్నికల కోసం బీజేపీ ప్రకటించిన అభ్యర్థుల జాబితాలో విజయశాంతి పేరు లేదు. దీంతో తీవ్ర ఆమె అసహనంతో రగిలిపోతున్నారు. సోషల్ మీడియా ద్వారా ఆమె బీజేపీకి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేస్తున్నారు. పైగా, పార్టీ కార్యక్రమాల్లో కూడా పాల్గొనడం లేదు. దీంతో ఆమె పార్టీకి రాజీనామా చేస్తారనే ప్రచారం జోరుగా సాగుతుంది.
మరోవైపు, విజయశాంతితో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మాట్లాడినట్టు ప్రచారం జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీలో చేరాలని రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేయగా, ఆమె కూడా సానుకూలంగా స్పందించినట్టు సమాచారం. అయితే, ఒకవేళ పార్టీలో చేరితే ఆమె కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తారా లేదా అన్నది తెలియాల్సివుంది. అలా పోటీ చేయని పక్షంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల తరపున ఆమె ప్రచారం చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది.
విజయశాంతితో రేవంత్ రెడ్డి మాట్లాడినపుడు.. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో మెదక్ లోక్‌సభ స్థానంలో పోటీ చేసేందుకు అవకాశం కల్పిస్తామని హామీ ఇచ్చినట్టు సమచారం. దీంతో రెండు మూడు రోజుల్లో ఆమె కాంగ్రెస్ పార్టీలో చేరే విషయంపై ఓ స్పష్టత వస్తుందని భావిస్తున్నారు.