శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : శనివారం, 8 జనవరి 2022 (14:20 IST)

వనమా రాఘవకు 14 రోజుల రిమాండ్.. ఖమ్మం జైలుకు తరలింపు

Vanama
పాల్వంచ నాగ రామకృష్ణ ఫ్యామిలీ ఆత్మహత్య కేసులో అరెస్టయిన వనమా రాఘవకు న్యాయస్థానం 14రోజుల రిమాండ్ విధించింది. వనమా రాఘవపై ప్రస్తుతం 12 కేసులకు సంబంధించి దర్యాప్తు చేస్తున్నామని, ఇంకెవరైనా బాధితులుంటే తమకు ఫిర్యాదు చేయాలని పోలీసులు కోరుతున్నారు. 
 
నాగ రామకృష్ణ కుటుంబం ఆత్మహత్యకు సంబంధించి పోలీసులు రాఘవపై ఐపీసీ 302, 306, 307 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఇక వనమాను శనివారం అదుపులోకి తీసుకున్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి కూడా ఆయనపై సస్పెండ్ వేటు వేసింది. 
 
వివరాల్లోకి వెళితే.. శుక్రవారం రాత్రి దమ్మపేట పోలీసులు మందలపల్లి వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా ఆంధ్రా ప్రాంతం నుంచి కారులో వస్తున్న రాఘవతో పాటు యూత్ కాంగ్రెస్ నాయకుడు గిరీశ్, కారు డ్రైవర్ మురళిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వారిని పాల్వంచ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. 
 
విచారణ అధికారి అయిన పాల్వంచ ఏఎస్పీ రోహిత్‌ రాజ్‌ని సుమారు 10 గంటల పాటు విచారించి అనేక సమాధానాలు రాబట్టారు. శనివారం ఉదయం వైద్య పరీక్షల అనంతరం రాఘవను కొత్తగూడెం కోర్టులో ఎదుట హాజరుపరిచారు.
 
ఈ కేసులో పోలీసులు సమర్పించిన ప్రాథమిక ఆధారాలను పరిశీలించిన న్యాయమూర్తి వనమా రాఘవకు 14 రోజుల రిమాండ్ విధిస్తూ ఆదేశాలు జారీచేశారు. దీంతో అతడిని ఖమ్మం జిల్లా జైలుకు తరలించారు.