సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఎం
Last Updated : బుధవారం, 21 ఆగస్టు 2019 (08:32 IST)

జేపీ నడ్డా ఎవరో తెలియదా?..కేటీఆర్‌ పై దత్తాత్రేయ ఆగ్రహం

బీజేపీ కార్యనిర్వాహక అధ్యక్షుడు జేపీ నడ్డా ఎవరో తెలియదని టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ అనడంపై కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ సీనియర్ నేత బండారు దత్తాత్రేయ తీవ్రంగా మండిపడ్డారు. కేటీఆర్‌ వ్యాఖ్యలు విడ్డూరంగా ఉన్నాయని ధ్వజమెత్తారు. ఈ మేరకు కేటీఆర్‌కు దత్తాత్రేయ బహిరంగ లేఖ విడుదల చేశారు. 
 
2016లో నడ్డా కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రిగా ఉన్నప్పుడు తెలంగాణలో ఎయిమ్స్‌ ఏర్పాటు, ఫార్మా ప్రాజెక్టుల్లో రాష్ట్రానికి ప్రాధాన్యత ఇవ్వాలని మీరు కలిసి విన్నవించిన విషయం మరిచారా అని ప్రశ్నించారు.

మూడుసార్లు ఎమ్మెల్యే, రెండుసార్లు రాజ్యసభ సభ్యుడిగా, కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రిగా ప్రజాసేవలో ఉన్న నేత తెలియకపోవడం మీ రాజకీయ అజ్ఞానానికి మచ్చుతునక అన్నారు. ఆయుష్మాన్‌ భారత్‌ దేశ మన్ననలు పొందుతుంటే.. తెలంగాణలో ఆరోగ్యశ్రీ ఆపేయడంతో మధ్యతరగతి రోగులు రోడ్డు మీదకు వచ్చారని ఆవేదన వ్యక్తం చేశారు. 
 
కాళేశ్వరం ప్రాజెక్టు వ్యయాన్ని రూ. 35 వేల కోట్లకు పెంచారని, గొర్రెల పంపిణీలో రూ. 3 వేల కోట్ల అవినీతి జరిగిందని కలెక్టర్లతో విచారణ జరిపించడం వాస్తవం కాదా అని ప్రశ్నించారు. హైదరాబాద్‌ను డల్లాస్‌గా మార్చుతామని చెప్పి మురికికూపంగా మార్చారని విమర్శించారు.

ఎన్నికలకు ముందు లక్ష ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పి కేవలం 28 వేల ఉద్యోగాలు మాత్రమే ఇచ్చారని గుర్తు చేశారు. జేపీ నడ్డాపై నిందలు మోపడం చూస్తుంటే కేటీఆర్‌కు బీజేపీ జ్వరం పట్టుకున్నట్లు ఉందని దత్తాత్రేయ ఎద్దేవా చేశారు.