మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 11 మే 2021 (12:38 IST)

కరోనాతో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు వ్యక్తులు మృతి

కరోనా మహమ్మారి బారిన పడి ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు వ్యక్తులు.. గంటల వ్యవధిలోనే మృతి చెందారు. ఈ హృదయవిదారక ఘటన హైదరాబాద్‌లోని కాప్రా సర్కిల్‌ పరిధిలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే వంపుగూడకు చెందిన వ్యాపారి పీసరి జనార్దన్‌రెడ్డి(60), జ్యోతి(54) దంపతులు. వీరికి కొడుకు హరీశ్‌రెడ్డి(30)తోపాటు కూతురు ఉన్నారు. హరీశ్‌రెడ్డికి గత ఏడాది ఆగస్టులో వివాహమైంది. 
 
జనార్దన్‌రెడ్డి 60వ పుట్టినరోజు సందర్భంగా గత నెల 18న కుటుంబీకులంతా డార్జిలింగ్‌ పర్యటనకు వెళ్లి.. 21న తిరిగి వచ్చారు. 22న హరీశ్‌రెడ్డి అనారోగ్యానికి గురయ్యాడు. కరోనా పరీక్ష చేయించుకోగా నెగెటివ్‌ వచ్చింది. అయినా జ్వరం తగ్గకపోవడంతో 26న మరోసారి పరీక్ష చేయించుకోగా పాటిజివ్‌గా తేలింది. డాక్టర్ల సూచన మేరకు ఇంట్లోనే మూడు రోజులు చికిత్స పొందాడు.
 
పరిస్థితి క్షీణించడంతో మే 1న ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేరాడు. జనార్దన్‌రెడ్డి దంపతులకూ ఈ నెల 5న కరోనా నిర్ధారణ అయింది. వారిద్దరినీ సుచిత్ర దగ్గరున్న ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్చారు. ఆదివారం ఉదయం 5.30 గంటల సమయంలో హరీశ్‌రెడ్డి మృతిచెందారు. పరిస్థితి విషమించడంతో అదేరోజు రాత్రి 9 గంటల సమయంలో జనార్దన్‌రెడ్డి, ఆపై గంట సేపటికి జ్యోతి ప్రాణాలు విడిచారు.
 
జనార్దన్‌రెడ్డి తాను చనిపోయే గంట ముందు కుమారుడి ఆరోగ్యంపై ఆరా తీసినట్లు కుటుంబీకులు తెలిపారు. అతడిని బాగా చూసుకోవాలని చెప్పారని వారు పేర్కొన్నారు. అప్పటికే హరీశ్‌రెడ్డి అంత్యక్రియలూ పూర్తయ్యాయి. చివరకు ముగ్గురూ మృతి చెందడంతో కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది.