శనివారం, 30 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 5 ఫిబ్రవరి 2023 (17:48 IST)

ప్రభుత్వ వైఫల్యాలే అజెండాగా టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పాదయాత్ర

revanth reddy
తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పాదయాత్ర చేపట్టనున్నారు. ప్రజా సమస్యలు, ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడమే అజెండాగా ఆయన ఈ పాదయాత్ర చేయనున్నారు. 'హాత్ సే హాత్ జోడో అభియాన్'లో భాగంగా సోమవారం నుంచి ఈ పాదయాత్రను ఆయన  చేపడుతారు. 
 
ఈ పాదయాత్ర మేడారం సమ్మక్క సారలమ్మ జాతర నుంచి ప్రారంభంకానుంది. ఉదయం 8 గంటలకు రేవంత్‌ రెడ్డి హైదరాబాద్‌ నుంచి బయలుదేరి.. వరంగల్‌ హైవే మీదుగా ములుగు చేరుకుంటారు. గట్టమ్మ, సాయిబాబా దేవాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఆ తర్వాత ఉదయం 11 గంటలకు మేడారం సమ్మక్క సారలమ్మల వద్ద ప్రత్యేక పూజలు చేస్తారు. 
 
పిమ్మట మధ్యాహ్నం 12 గంటలకు పాదయాత్ర ప్రారంభించనున్నారు. మేడారం నుంచి కొత్తూరు, నార్లాపూర్‌, ప్రాజెక్ట్‌ నగర్‌ వరకు పాదయాత్ర కొనసాగుతుంది. ప్రాజెక్ట్‌ నగర్‌లో భోజన విరామం అనంతరం 2.30 గంటలకు తిరిగి పాదయాత్ర ప్రారంభమవుతుంది. 
 
సాయంత్రం 4.30 గంటల నుంచి 5 గంటలకు పస్రా గ్రామంలో టీ విరామం తర్వాత పస్రా కూడలిలో సమావేశం నిర్వహిస్తారు. అక్కడి నుంచి  రాత్రి 8 గంటలకు రామప్ప గ్రామానికి చేరుకున్న రేవంత్‌రెడ్డి.. రాత్రికి అక్కడే బస చేయనున్నారు.