తెలంగాణాలో బడుల ప్రారంభానికి విద్యాశాఖ కసరత్తు
తెలంగాణా రాష్ట్రంలో విద్యాసంస్థలు తెరవడానికి విద్యాశాఖ కసరత్తు చేస్తోంది. వైద్య శాఖ సూచనల మేరకు విద్యా సంస్థలు తెరవాలని ప్రభుత్వం భావిస్తోంది. రాష్ట్రంలో కొవిడ్ కేసుల సంఖ్య గణనీయంగా తగ్గింది.
ప్రస్తుతం రోజుకు 500 - 700 మధ్య కొత్త కేసులు నమోదవుతున్నాయి. నల్గొండ, కరీంనగర్, పెద్దపల్లి, ఖమ్మం, వరంగల్ నగర తదితర జిల్లాల్లోని కొన్ని గ్రామాల్లో మినహా రాష్ట్ర వ్యాప్తంగా కరోనా తగ్గుముఖం పట్టినట్లుగా వైద్యవర్గాలు చెబుతున్నాయి.
ఈ నేపథ్యంలో విద్యాసంస్థలు తిరిగి ప్రారంభించడానికి ఇది అనుకూల సమయమేనని వైద్య శాఖ తెలిపింది. విద్యాసంస్థల్లోని బోధన, బోధనేతర సిబ్బందిలో అత్యధికులు ఇప్పటికే టీకా పొంది ఉన్నారని తెలిపింది.
కొవిడ్ నిబంధనలను అనుసరిస్తూ పాఠశాలలు, కళాశాలలను నిర్వహించడం వల్ల ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలు తక్కువేనని అభిప్రాయపడింది. ఈ మేరకు విద్యాశాఖకు ఇటీవల సూత్రప్రాయంగా అంగీకారాన్ని తెలిపినట్లుగా వైద్యవర్గాలు పేర్కొన్నాయి.