నమ్మకద్రోహం చేసేవారు బాగుపడరు: ఈటల రాజేందర్
నమ్మకద్రోహం చేసేవారు ఎవరుకూడా బాగుపడరని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ వ్యాఖ్యానించారు. బుధవారం హుజూరాబాద్ నియోజకవర్గం పరిధిలో టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల సమావేశానికి మంత్రి ఈటల రాజేందర్ హాజరయ్యారు.
ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన.. పార్టీలో తనకు వ్యతిరేకంగా జరుగుతున్న పరిణామాలపై ఆవేదన వ్యక్తం చేశారు. తనకు కొట్లాడటం తెలుసు కానీ.. దొంగ దెబ్బతీయడం తెలియదని వ్యాఖ్యానించారు. కోట్లు ఖర్చయినా తాను ఎవరి దగ్గర చేయి చాచలేదన్నారు.
నమ్మినవారే మోసం చేస్తే బాధ కలుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలు ధర్మం తప్పరని, అందువల్లే తాను గత ఎన్నికల్లో గెలిచానన్నారు. ప్రజలు కూడా ధర్మం తప్పిఉంటే తాను గెలిచేవాడిని కాదని పేర్కొన్నారు. .
కాగా, హుజూరాబాద్ నియోజకవర్గం టీఆర్ఎస్ పార్టీలో నెలకొన్న వర్గపోరు నేపథ్యంలోనే మంత్రి ఈటల రాజేందర్ ఈ వ్యాఖ్యలు చేసినట్లు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. పార్టీలోని ఓ వర్గం ఈటల రాజేందర్ ఓటమి కోసం పనిచేసిందనే ప్రచారం నియోజకవర్గం పరిధిలో జరుగుతోంది.
ఈ నేపథ్యంలోనే కొంత మంది పార్టీలో ఉండి వెన్నుపోటు రాజకీయాలు చేస్తున్నారని, తన ఓటమి కోసం పనిచేస్తున్నారని ఈటల ఆవేదన వ్యక్తం చేశారు. ఇదిలాఉండగా, గతంలో గులాబీ ఓనర్లం తామే అంటూ ఈటెల రాజేందర్ చేసిన వ్యాఖ్యలు టీఆర్ఎస్ పార్టీలోనే కాక.. తెలంగాణ రాజకీయాల్లోనూ ప్రకంపనలు సృష్టించిన విషయం తెలిసిందే.