పీవీ కుటుంబానికి కేసీఆర్ బహుమతి .. ఎమ్మెల్యీ అభ్యర్థిగా సురభి

kcrcm
ఠాగూర్| Last Updated: సోమవారం, 22 ఫిబ్రవరి 2021 (08:53 IST)
మాజీ ప్రధానమంత్రి దివంగత పీవీ నరసింహా రావు కుటుంబానికి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఓ బహుమతి ఇచ్చారు. పీవీ నరసింహా రావు శతజయంతి వేడుకలు జరుపుకుంటున్న వేళ.. పీవీ కుమార్తెల్లో ఒకరైన ప్రముఖ చిత్రకారిణి, విద్యావేత్త సురభి వాణీదేవిని తెరాస ఎమ్మెల్సీ అభ్యర్థినిగా ప్రకటించారు. ఈమె హైదరాబాద్ ‌- రంగారెడ్డి - మహబూబ్‌నగర్‌ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గం టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా ప్రకటించారు.

సోమవారం హైదరాబాద్‌లో ఆమె నామినేషన్‌ దాఖలు చేయనున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ అనూహ్యంగా తీసుకున్న ఈ నిర్ణయంతో టీఆర్‌ఎస్‌ విజయావకాశాలు మరింత పెరిగాయన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా పీవీకి జనాదరణ ఉన్న నేపథ్యాన్ని కూడా పలువురు ప్రస్తావిస్తున్నారు.

తెలంగాణ ముద్దుబిడ్డ పీవీకి గతంలో జరిగిన అవమానాలు, అన్యాయాన్ని దిద్దుకునేందుకు ఇదొక మంచి అవకాశమని పలువురు విద్యావేత్తలు అభిప్రాయపడుతున్నారు. వాణీదేవి స్వస్థలం కరీంనగర్‌ జిల్లా వంగర గ్రామం. ఆమె విద్యాభ్యాసం, వృత్తిజీవితం మొత్తం హైదరాబాద్‌ కేంద్రంగానే సాగింది.

1986లో జేఎన్టీయూ నుంచి డిప్లొమా ఇన్‌ ఫైన్‌ ఆర్ట్స్‌లో పట్టాపొందారు. విద్యావేత్తగా, చిత్రకారిణిగా, సంఘ సేవకురాలిగా ఆమెకు మంచి గుర్తింపు ఉన్నది. 35 ఏండ్లుగా వందల పెయింటింగ్స్‌ వేసిన వాణీదేవి.. తన పెయింటింగ్స్‌తో ఇప్పటివరకు 15 ఎగ్జిబిషన్లు నిర్వహించారు. అమెరికా రాజధాని వాషింగ్టన్‌-డీసీలో ఉన్న గాంధీ మెమోరియల్‌ సెంటర్‌లో ‘సారే జహాసె అచ్ఛా’ పేరుతో ఎగ్జిబిషన్‌ నిర్వహించి రికార్డు సృష్టించారు.దీనిపై మరింత చదవండి :