కాంగ్రెస్ ట్విట్టర్‌ను బ్లాక్ చేసిన మంత్రి కేటీఆర్
తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ట్విట్టర్ ఖాతాను తెలంగాణ మంత్రి కేటీఆర్ బ్లాక్ చేశారు. కాంగ్రెస్ నేతలు ట్విట్టర్ వేదికగా సంధించిన ప్రశ్నలకు ఆయన సమాధానం చెప్పలేక టి కాంగ్రెస్ ఖాతాను బ్లాక్ చేసినట్టు ప్రచారం సాగుతోంది.
దీనిపై టీ కాంగ్రెస్ స్పందించింది. "ట్విట్టర్ పిట్ట తోకముడిచింది. ప్రశ్నను చూసి గజగజ వణికింది. ప్రజల తరపున అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పలేక తెలంగాణ కాంగ్రెస్ అధికారిక ట్విట్టర్ హ్యాండిల్‌ను కేటీఆర్ బ్లాక్ చేశారు. ఒక జాతీయ పార్టీ ట్విట్టర్ హ్యాండిల్‌ను బ్లాక్ చేయడం కేటీఆర్ మానసిక స్థితికి అద్దం పడుతోంది" అంటూ మరో ట్వీట్ చేశారు.
ఇదిలావుంటే, కేటీఆర్ నిర్ణయాన్ని కాంగ్రెస్ పార్టీ నేతలు, ఆ పార్టీ అభిమానులు సోషల్ మీడియా వేదికగా ఓ ఆట ఆడుకుంటున్నారు. కాంగ్రెస్ చెప్పిన మాట నిజమేనని, ఆ పార్టీ అడిగే ప్రశ్నలకు బదులివ్వలేకే కేటీఆర్ ఆ పార్టీ ట్విట్టర్‌ను బ్లాక్ చేశారంటూ పోస్టులు పెడుతున్నారు.
అదేసమయంలో కేటీఆర్ నిర్ణయాన్ని సమర్థించే క్రమంలో కొందరు గతంలో టీఆర్ఎస్ ట్విట్టర్ హ్యాండిల్‌ను బ్లాక్ చేసిన రేవంత్ రెడ్డి నిర్ణయాన్ని వెలుగులోకి తీసుకువస్తూ కాంగ్రెస్ పార్టీపై సెటైర్లు సంధిస్తున్నారు. మొత్తంగా కాంగ్రెస్ పార్టీ ట్విట్టర్ హ్యాండిల్‌ను బ్లాక్ చేస్తూ కేటీఆర్ తీసుకున్న నిర్ణయంపై సోషల్ మీడియాలో పెద్ద చర్చే నడుస్తోంది.