ఆదివారం, 12 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 12 జనవరి 2025 (13:42 IST)

హీరో విశాల్ త్వరగా కోలుకోవాలి : హీరోయిన్ వరలక్ష్మి!!

varalakshmi
అనారోగ్యంతో బాధపడుతున్న హీరో విశాల్ త్వరగా కోలుకోవాలని హీరోయిన్ వరలక్ష్మి శరత్ కుమార్ ఆకాంక్షించారు. విశాల్, అంజలి, వరలక్ష్మి శరత్ కుమార్ జంటగా నటించిన తాజా చిత్రం మద గజ రాజా. సుందర్ సి దర్శకుడు. విజయ్ ఆంటోనీ సంగీతం సమకూర్చారు. జెమిని ఫిల్మ్ సర్క్యూట్ పతాకంపై రూపొందింది. పొంగల్ కానుకగా ఆదివారం విడుదలైంది. అయితే, శనివారం రాత్రి ఈ సినిమా ప్రీమియర్ షోను ప్రదర్శించారు. ఈ షోకు హీరోయిన్ వరలక్ష్మి కూడా వచ్చారు. ఈ సందర్భంగా విశాల్ ఆరోగ్యం గురించి మీడియా ప్రశ్నించింది. దీనిపై ఆమె స్పందిస్తూ, అభిమానుల ఆశీస్సులు ఆయనకు ఎప్పుడూ ఉంటాయన్నారు. ఆయన త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నానని తెలిపారు.
 
'విశాల్ ఆరోగ్య పరిస్థితి గురించి వస్తోన్న వార్తలు చూశాను. ఆయన వైరల్ ఫీవర్‌తో బాధపడుతున్నారు. ఆయన త్వరగా కోలుకోవాలని.. మంచి ఆరోగ్యంతో ప్రేక్షకుల ముందుకురావాలని కోరుకుంటున్నా' అని చెప్పారు. 'మదగజ రాజ' తన రెండో చిత్రమన్నారు. షూటింగ్ సమయంలో దర్శకుడు సుందర్ తనకెంతో సపోర్ట్ చేశారని చెప్పారు. 
 
'ఇది నాకు రెండో చిత్రం. షూట్ సమయంలో ఎంతో సరదాగా గడిపాను. వర్క్ విషయంలో దర్శకుడు నాకెంతో సాయం చేశారు. యాక్టింగ్‌కు సంబంధించిన ఎన్నో విషయాలు నేర్పించారు. విశాల్ కూడా ఈ సినిమా కోసం ఆ రోజుల్లో ఎంతో కష్టపడ్డారు. ఇందులో ఆయన 8 ప్యాక్ బాడీతో కనిపిస్తారు. ఇదొక పూర్తిస్థాయి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్. ప్రేక్షకులు తప్పకుండా దీనిని ఆదరిస్తారని నమ్ముతున్నా' అని తెలిపారు.
 
అనంతరం పెళ్లి తర్వాత తన జీవితంపై మాట్లాడారు. "వివాహం తర్వాత జీవితం బాగుంది. నికోలయ్ ఎంతో మంచి వ్యక్తి. అలాంటి వ్యక్తిని భర్తగా పొందినందుకు సంతోషంగా ఉన్నా. ఫ్యామిలీ లైఫ్‌నకు అతడు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తుంటారు. కుటుంబసభ్యులతో నాకంటే ఎక్కువగా తనే కాంటాక్ట్ ఉంటాడు. మా అమ్మ వాళ్లు కూడా అన్ని విషయాలను నాకంటే ముందు తనకే చెబుతారు. అంతలా అతను మా కుటుంబానికి దగ్గరయ్యాడు' అని చెప్పారు.