సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 3 ఫిబ్రవరి 2023 (10:02 IST)

కవి పండితులకు జనన మరణాలు వుండవు... వారి కీర్తి అజరామరం : సీఎం కేసీఆర్

viswanath
ప్రముఖ దర్శకుడు, తెలుగు సినీ పరిశ్రమ దిగ్గజం కె.విశ్వనాథ్ మృతిపట్ల తెలంగాణ సీఎం, బీఆర్ఎస్ అధినేత కె.చంద్రశేఖర్ రావు తన ప్రగాఢ సంతాపాన్ని తెలిపారు. అతి సామాన్యమైన కథనైనా తమ అద్భుత ప్రతిభతో వెండి తెర దృశ్య కావ్యంగా మలిచే అరుదైన దర్శకులు కె.విశ్వనాథ్ అని సీఎం అన్నారు.
 
భారతీయ సామాజిక విలువలకు, సంస్కృతీ సంప్రదాయాలకు తమ సినిమాలో విశ్వనాథ్ పెద్ద పీట వేశారని సీఎం అన్నారు. వారి కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతిని తెలిపారు. సంగీత, సాహిత్యాలను ప్రధాన ఇతివృత్తంగా, మానవ సంబంధాల నడుమ నిత్యం తలెత్తే వైరుధ్యాలను అత్యంత సృజనాత్మకంగా, సున్నితంగా దృశ్యమానం చేసిన గొప్ప భారతీయ దర్శకులు విశ్వనాథ్ అని సీఎం కొనియాడారు. 
 
గతంలో, విశ్వనాథ్ ఆరోగ్యం బాగాలేనప్పుడు వారి ఇంటికి వెళ్ళి పరామర్శించిన సమయంలో సినిమాలు, సంగీతం, సాహిత్యంపై తమ మధ్య జరిగిన చర్చను సీఎం గుర్తుచేసుకున్నారు. దాదా సాహెబ్ ఫాల్కే, రఘుపతి వెంకయ్య వంటి అనేక ప్రతిష్టాత్మక అవార్డులతో సత్కారం వారి దర్శక ప్రతిభకు నిదర్శనమని సీఎం అన్నారు. తెలుగు సినిమా వున్నన్ని రోజులు కె. విశ్వనాథ్ పేరు నిలిచి ఉంటుందని సీఎం అన్నారు.
 
"జయంతి తే సుకృతినో రససిధ్ధాః కవీశ్వరాః
నాస్తి తేషాం యశః కాయం జరా మరణజం భయం"
(కవి పండితులకు జనన మరణాలు వుండవు. వారి కీర్తి అజరామరం.)
ఈ వాక్కు విశ్వనాథ్ గారికి అక్షరాలా వర్తిస్తుంది అని ట్విట్టర్ వేదికగా సీఎం కేసీఆర్ సంతన ప్రగాఢ సంతాపాన్ని తెలిపారు.