శుక్రవారం, 3 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 3 ఫిబ్రవరి 2023 (09:32 IST)

శంకరుడికి ఆభరణంగా విశ్వనాథ్ కైలాసానికి ఏతెంచారు.. చిరంజీవి

viswanath - chiru
దర్శక దిగ్గజం కె.విశ్వనాథ్ మృతిపై మెగాస్టార్ చిరంజీవి తన సంతాపాన్ని వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన శుక్రవారం తన ట్విట్టర్ వేదికగా ఒక సుధీర్ఘ ప్రకటన విడుదల చేశారు. "పితృ సమానులు, కళాతపస్వీ కె. విశ్వనాథ్ గారు ఇక లేరు అనే వార్త దిగ్భ్రాంతికి గురిచేసింది. ఆయన గొప్పతనం గురించి చెప్పటానికి మాటలు చాలవు. పండితులని పామరులనీ కూడా ఒకేలా మురిపించే ఆయన చిత్రాల శైలి విశిష్టమైంది. 
 
ఆయనలా సున్నితమైన ఆర్ట్ ఫిలిమ్స్‌ని కూడా బ్లాక్ బస్టర్ హిట్స్‌గా మలిచిన దర్శకుడు బహుశా ఇంకొకరు లేరు. తెలుగు జాతి ఖ్యాతిని తన సినిమాల ద్వారా ప్రపంచ స్థాయికి తీసికెళ్ళిన మహా దర్శకుడు ఆయన.
 
ఆయన దర్శకత్వంలో 'శుభలేఖ,' స్వయంకృషి, 'ఆపద్భాంధవుడు' అనే మూడు చిత్రాల్లో నటించే అవకాశం నాకు లభించింది. నాకు వ్యక్తిగతంగా ఆయనతో ఉన్నది గురు శిష్యుల సంబంధం. అంతకు మించి తండ్రీ కొడుకుల అనుబంధం. ఆయనతో గడిపిన సమయం నాకు అత్యంత విలువైనది.
 
ప్రతి నటుడికీ ఆయనతో పని చేయటం ఒక ఎడ్యుకేషన్ వంటిది. ఆయన చిత్రాలు భావి దర్శకులకి ఒక గైడ్ లాంటివి. 43 సంవత్సరాల క్రితం, ఆ మహనీయుడి ఐకానిక్ చిత్రం 'శంకరాభరణం' విడుదలైన రోజునే బహుశా ఆ శంకరుడికి ఆభరణంగా, ఆయన కైలాసానికి ఏతెంచారు.
 
ఆయన చిత్రాలు, ఆయన చిత్రాల సంగీతం, ఆయన కీర్తి అజరామరమైనవి. ఆయన లేని లోటు భారతీయ చిత్ర పరిశ్రమకి, తెలుగు వారికి ఎప్పటికీ తీరనిది. ఆయన ఆత్మకి శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ ఆయన కుటుంబ సభ్యులందరికీ, అసంఖ్యాకమైన ఆయన అభిమానులందరికీ నా ప్రగాఢ సానుభూతి తెలియచేసుకుంటున్నాను.