Bizarre in Pushpa movie Theatre పుష్ప-2 థియేటర్ నుంచి ప్రాణభయంతో పరుగో పరుగు
'Pushpa 2' Screening Disrupted In Mumbai, Movie-Goers Cough Due To Spray అల్లు అర్జున్ హీరోగా నటించిన తాజా చిత్రం పుష్ప-2. శుక్రవారం ప్రపంచ వ్యాప్తంగా ఆరు భాషల్లో విడుదలై, సూపర్ హిట్ టాక్‌తో విజయవంతంగా ప్రదర్శితమవుతుంది. అయితే, ముంబైలో ఈ చిత్రం ప్రదర్శితమవుతోన్న థియేటర్‌లో అనూహ్య సంఘటన ఒకటి చోటుచేసుకుంది. గుర్తుతెలియని ఓ వ్యక్తి థియేటర్‌లో ఘాటైన స్ప్రే కొట్టడంతో ప్రేక్షకులు ఆందోళనకు గురయ్యారు.
గురువారం రాత్రి బాంద్రాలోని ఓ థియేటర్‌లో సెకండ్ షో ప్రదర్శితమవుతోన్న సమయంలో గుర్తుతెలియని వ్యక్తి ఘాటైన స్ప్రే కొట్టారు. దీంతో ప్రేక్షకులు దగ్గు, వాంతులతో ఇబ్బందులు పడుతూ ప్రాణభయంతో పరుగులు తీశారు. థియేటర్ యాజమాన్యం కాసేపు షోను నిలిపివేసి పోలీసులకు సమాచారం అందించారు.
ఆ వెంటనే థియేటర్ వద్దకు చేరుకున్న పోలీసులను హాలును క్షుణ్ణంగా తనిఖీ చేశారు. విరామ సమయంలో బయటకు వచ్చి తిరిగి లోపలికి వెళ్లిన తర్వాత అందరికీ దగ్గు వచ్చినట్లు ప్రేక్షకులు మీడియాకు చెప్పారు. కొందరికి వాంతులు అయినట్లు తెలిపారు. పోలీసులు వచ్చి తనిఖీ చేసిన తర్వాత 20 నిమిషాలకు తిరిగి షో ప్రారంభమైందన్నారు.
'పుష్ప ది రూల్' ప్రీమియర్‌లో భాగంగా హైదరాబాద్‌లోని సంధ్య థియేటర్‌లో తొక్కిసలాట జరిగిన విషయం తెలిసిందే. థియేటర్ వద్దకు బుధవారం రాత్రి 9.30 గంటల సమయంలో వచ్చిన హీరో అల్లు అర్జున్‌ను చూసేందుకు అభిమానులు ఎగబడటంతో తొక్కిసలాట జరిగింది. ఈక్రమంలో వారిని నిలువరించేందుకు పోలీసులు లాఠీఛార్జి చేయడంతో రేవతి(35)తో పాటు ఆమె కుమారుడు శ్రీతేజ(9) కింద పడిపోయి జనం కాళ్ల మధ్య నలిగిపోయారు.
ఇద్దరూ గాయాలతో స్పృహ తప్పారు. పోలీసులు వారికి సీపీఆర్ చేసి స్థానిక ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ రేవతి మృతి చెందారు. ఈ ఘటనపై నిర్మాణ సంస్థ స్పందిస్తూ.. ఆ కుటుంబానికి అండగా ఉంటామని తెలిపింది. సాధ్యమైనంత వరకూ అన్నివిధాలా సహాయాన్ని అందిస్తామంది.