శనివారం, 24 ఫిబ్రవరి 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. సమీక్ష
Written By డీవీ
Last Updated : శుక్రవారం, 2 సెప్టెంబరు 2022 (16:34 IST)

ఫస్ట్ డే ఫస్ట్ షోకు మాత్ర‌మే - రివ్యూ రిపోర్ట్‌

Srikanth Reddy-Sanchitha Basu
Srikanth Reddy-Sanchitha Basu
నటీనటులు: శ్రీకాంత్ రెడ్డి-సంచిత బసు-తనికెళ్ల భరణి-వెన్నెల కిషోర్-శ్రీనివాసరెడ్డి-ప్రభాస్ శీను-వంశీధర్ గౌడ్ తదితరులు
సాంకేతిక‌త‌- ఛాయాగ్రహణం: ప్రశాంత్ అంకిరెడ్డి, సంగీతం: రధన్, నిర్మాతలు: శ్రీజ ఏడిద-శ్రీరామ్ ఏడిద
రచన: అనుదీప్ కేవీ,  దర్శకత్వం: వంశీధర్ గౌడ్-లక్ష్మీనారాయణ
 
ప్ర‌తిష్టాత్మ‌కమైన పూర్ణోద‌య క్రియేష‌న్స్ నుంచి వార‌సురాలు శ్రీ‌జ నిర్మించిన చిత్రం ‘ఫస్ట్ డే ఫస్ట్ షో’. టైటిల్‌లోనే ‘ఫస్ట్ డే ఫస్ట్ షో’  చూడాల‌నే ఓ కుర్రాడి క‌థ అని చెప్పేశారు. ఈ సినిమాకు ‘జాతిరత్నాలు’  ఫేమ్ దర్శకుడు అనుదీప్ కేవీ క‌థ‌ను అందివ్వ‌డం విశేషం. ఆ త‌ర‌హాలోనే ఫన్నీ ఎంటర్టైనర్ లాగా వుంటుంద‌ని ప‌దేప‌దే చెప్పారు. పైగా  ఈ సినిమాను అనుదీప్ శిష్యులు వంశీధర్-లక్ష్మీనారాయణ డైరెక్ట్ చేశారు. మ‌రి ఇన్ని ప్ర‌త్యేక‌త‌లు వున్న సినిమా ఈరోజే విడుద‌లైంది. ఎలా వుందో చూద్దాం.
 
కథ:
 
2001లో నారాయ‌ణ‌ఖేడ్‌లో జ‌రిగిన క‌థ‌. ప‌వ‌న్ క‌ళ్యాణ్ అభిమాని క‌థ‌. శీను (శ్రీకాంత్ రెడ్డి) డిగ్రీ చదువుతున్న కుర్రాడు. అతను పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు వీరాభిమాని. తన కాలేజీలోనే చదివే లయ (సుచిత బసు) అంటే శీనుకు ఇష్టం. ఆమె కూడా పవన్ అభిమానే. లయకూ తనంటే ఇష్టమని.. ఆమె ‘ఖుషి’ సినిమా ఫస్ట్ డే ఫస్ట్ షోను తనతో కలిసి చూడాలనుకుందని తెలిసి ఉబ్బితబ్బిబ్బయిపోయిన శీను.. టికెట్ల వేటలో పడతాడు. కానీ టికెట్ సంపాదించ‌డం చాలా క‌ష్ట‌మ‌ని అనుభ‌వ‌పూర్వ‌కంగా తెలుసుకుంటాడు. ఫైన‌ల్‌గా త‌న స్నేహితుడి తాత ద‌గ్గ‌ర రెండు టికెట్లు వున్నాయ‌ని వాటికోసం శ్రీ‌ను వ‌స్తాడు. కానీ ఆ తాత చ‌నిపోతాడు. అప్పుడు శ్రీ‌ను ఏం చేశాడు? ఆ త‌ర్వాత ప‌రిణామాలు ఏమిటి? అనేది మిగిలిన సినిమా.
 
విశ్లేషణ:
 
ఇది  2001నాటి క‌థ.  ఓ అభిమాని సినిమా టికెట్ కోసం చేసే ప్ర‌య‌త్నం అన‌గానే ఇప్ప‌టి త‌రానికి పెద్ద‌గా క‌నెక్ట్ కాదు.  ఇప్పుడంటే పెద్ద హీరో సినిమా రిలీజవుతుంటే ఆన్ లైన్ ‘బుక్ మై షో’ ఓపెన్ చేసి పెట్టుకుని ఇలా టికెట్లు పెట్టగానే అలా సీట్లు సెలక్ట్ చేసుకుని పేమెంట్ చేసి పడేస్తే నిమిషాల్లో టికెట్లు బుక్ అయిపోతాయి. కానీ అప్ప‌ట్లో అలాకాదు. కానీ కేవ‌లం సినిమా టికెట్ మీద‌నే ఒక ఊరిలో అక్క‌డి ప్ర‌జాల‌ను, అక్క‌డి వాతావ‌ర‌ణాన్ని చూపిస్తూ ప్రేక్ష‌కుల‌ను ఎంట‌ర్‌టైన్ చేయాలంటే కష్ట‌మే. కానీ అలాంటివే త‌న‌కు ఇష్ట‌మ‌ని అనుదీప్ చెబుతుండేవాడు. న‌లుగురు వెళ్ళేదారికాకుండా త‌న‌ది ప్ర‌త్యేకం అందుకే జాతిర‌త్నాలు తీశాన‌ని గ‌ర్వంగా చెప్పి, ఇది అంత‌కంటే న‌వ్విస్తుంద‌ని చెప్ప‌డం అవివేక‌మే అవుతుంది. ఈ పాయింట్‌ను న‌మ్మి సినిమా తీసిన నిర్మాత‌ల‌ను అభినందించాల్సిందే.
 
- ఇలాంటి క‌థ‌ను. పావుగంటలో లాగించేయొచ్చు. అంతేకానీ  రెండు గంటల నిడివితో సినిమా తీయ‌డం సొల్లు చెప్పిన‌ట్లుంటుంది. అందుకే మొద‌టిరోజున ఇంట‌ర్‌వెల్ త‌ర్వాత చాలామంది వాకౌట్ చేయడం విశేషం. ఇలాంటివి వెబ్‌సిరీస్‌కింద‌కు ప‌నికి వ‌స్తాయి. ఆ మ‌ధ్య మాఊరి నీళ్ళ‌ట్యాంక్ అనే సిరీస్ వ‌చ్చింది. ఇది కూడా దాదాపు అలాంటిదే. కానీ దాన్ని సాహ‌సం చేసి సినిమాగా మార్చ‌డం విశేష‌మ‌నే చెప్పాలి. 
 
- ఇలా చిన్న‌పాయింట్‌పై సినిమాలు ఓటీటీ పుణ్య‌మా అని చాలానే ప్రేక్ష‌కుల‌కు తెలిసిపోతున్నాయి. ఆ మ‌ధ్య త‌మిళంలో  వా క్వార్టర్ కటింగ్’ అని సినిమా వ‌చ్చింది. మందుబాటిల్‌కోసం బంద్ చేసిన రోజు దానికోసం ప‌డిన త‌ప‌న ఎలాంటిదే చూపించారు.  ఇలాంటి కథలతో ప్రేక్షకులను మెప్పించడం ఆషామాషీ విషయం కాదు.  ఫస్ట్ డే ఫస్ట్ షో’ సినిమాకు ఎటువంటి కసరత్తు చేయకుండా నారాయ‌ణ‌ఖేడ్‌లో జ‌రిగిన ఓ సంఘ‌ట‌న‌ను సినిమాగా తీయ‌డం జ‌రిగింది. సినిమా టిటెక్ కోసం ఓ అభిమాని ప‌డ్డ పాట్లు ఆ ఊరి వారికి వింత‌గా అనిపించ‌వ‌చ్చు. కానీ దేశం మొత్తం ఆ క‌థ‌ను చూపించాల‌నుకోవ‌డం విడ్డూర‌మే. ఫ్లూక్‌లో వ‌చ్చి హిట్ అయిన జాతిర‌త్నాలులో ముగ్గురు కుర్రాళ్ళు సిటీకి వ‌చ్చి ప‌డే తప‌న‌లో ఫ‌న్ క‌నిపిస్తుంది. కానీ ఇందులో అవేవీలేవు.    
 
కొత్త నటుడు శ్రీకాంత్ రెడ్డి బాగానే చేశాడు. లుక్స్ పరంగా అతను యావరేజ్ అనిపించినా.. తొలి సినిమా అనే బెరుకేమీ లేకుండా ఈజ్ తో నటించాడు. హీరోయిన్ సుచిత బసు పాత్ర నామమాత్రం. ఆమెకు నటించే స్కోపే దక్కలేదు. వెన్నెల కిషోర్ అప్పుడప్పుడూ తెరపై కనిపించి ప్రేక్షకులను కాస్త కాపాడే ప్రయత్నం చేశాడు. తనికెళ్ల భరణి  తండ్రి పాత్ర మామూలే.  మొత్తంగా చూస్తే  ఫస్ట్ డే ఫస్ట్ షో మాత్ర‌మే ఆడే సినిమా ఇది.