శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 14 అక్టోబరు 2019 (07:26 IST)

నేడు జగన్ - చిరంజీవి భేటీ.. ఎందుకో అంత ఆసక్తి?

వైకాపా అధినేత, ఏపీ ముఖ్యమంత్రి వైఎస్. జగన్ మోహన్ రెడ్డితో మెగాస్టార్ చిరంజీవి సోమవారం సమావేశంకానున్నారు. ఆయనతో పాటు.. "సైరా నరసింహా రెడ్డి" నిర్మాత, హీరో, తన తనయుడు రామ్ చరణ్ కూడా ఈ భేటీలో ఉండనున్నారు. అమరావతి, తాడేపల్లిగూడెంలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ఈ సమావేశం జరుగనుంది. 
 
నిజానికి ఈ భేటీపై ఇరు వర్గాల నేతలు స్పందిస్తూ, ఇది మర్యాదపూర్వక సమావేశమేనంటున్నప్పటికీ రాజకీయ వర్గాల్లో మాత్రం జోరుగా చర్చ జరుగుతోంది. జగన్ సీఎం అయిన తర్వాత టాలీవుడ్ నుంచి బడా స్టార్స్ ఎవరూ ఆయనను మర్యాదపూర్వకంగా కూడా కలవలేదన్న విమర్శలు వైసీపీ నుంచి వ్యక్తమయిన సంగతి తెలిసిందే.
 
టాలీవుడ్‌లోని కొందరు ప్రముఖులకు జగన్ సీఎం కావడం ఇష్టం లేదని నటుడు, ఎస్వీబీసీ చైర్మన్, హాస్యనటుడు పృథ్వీ కూడా అప్పట్లో వ్యాఖ్యానించి సంచలనం సృష్టించాడు. ఇలాంటి విమర్శల నేపథ్యంలో టాలీవుడ్ నుంచి చిరంజీవి జగన్‌ను కలవనుండటంతో అటు టాలీవుడ్‌తో పాటు ఇటు రాజకీయ వర్గాలు కూడా ఈ పరిణామాలను ఆసక్తికరంగా గమనిస్తున్నాయి. 
 
అయితే, చిరంజీవి సన్నిహితులు మాత్రం మరోలా స్పదిస్తున్నారు. 'సైరా నరసింహారెడ్డి' సినిమాను వీక్షించాలని కోరేందుకే జగన్‌ను చిరంజీవి కలుస్తున్నారని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. సీఎం సమ్మతిస్తే జగన్‌కు, ఆయన కుటుంబ సభ్యుల కోసం ప్రత్యేక షో వేయాలని నిర్మాత రామ్ చరణ్ భావిస్తున్నారు.