బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 16 సెప్టెంబరు 2020 (19:14 IST)

కరోనా వైరస్ సోకి తిరుపతి ఎంపీ దుర్గా ప్రసాద్ కన్నుమూత

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ అల్లకల్లోలం సృష్టిస్తోంది. ఈ వైరస్ బారిన ప్రతి రోజూ పదివేల మందికిపడుతున్నారు. తాజాగా తిరుపతి ఎంపీ బల్లి దుర్గా ప్రసాద్ కరోనా వైరస్ సోకి కన్నుమూశారు. గత కొన్ని రోజుల క్రితం కరోనా వైరస్ బారినపడి చెన్నైలోని ఓ కార్పొరేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ వచ్చిన ఆయన ఆరోగ్యం విషమించి బుధవారం సాయంత్రం కన్నుమూశారు. 
 
కాగా, ఏపీలో అధికార పార్టీ వైకాపా తరపున ఆయన ఎంపీగా కొనసాగుతున్నారు. గత 1985లో రాజకీయ రంగప్రవేశం చేసిన ఆయన.. గతంలో టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ ప్రోత్సాహంతో రాజకీయాల వైపు అడుగులేశారు. న్యాయవాద వృత్తిలో ఉంటూనే రాజకీయాల్లో ప్రవేశించారు. 
 
28 ఏళ్ల ప్రాయంలో అసెంబ్లీ గడపతొక్కిన ఆయన గత ఎన్నికలకు ముందు వైసీపీలో చేరారు. లోక్‌సభ ఎన్నికల్లో తిరుపతి నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీచేసి విజయం సాధించారు.
 
ఆయన నెల్లూరు జిల్లా గూడూరు నియోజకవర్గం నుంచి 4 పర్యాయాలు అసెంబ్లీకి వెళ్ళారు. ఆయన 1985, 1994, 1999, 2009లో ఎమ్మెల్యేగా గెలిచారు. గతంలో టీడీపీ ప్రభుత్వ హయాంలో మంత్రి పదవి కూడా చేపట్టారు. 1996 నుంచి 98 వరకు మంత్రిగా వ్యవహరించారు.
 
ఈయన స్వస్థలం జిల్లాలోని నాయుడుపేట మండలం భీమవరం గ్రామం. ఆయన తల్లిదండ్రులు పెంచలయ్య, రామలక్ష్మమ్మ. దుర్గాప్రసాద్‌కు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. దుర్గాప్రసాద్ మరణవార్త మీడియాలో రావడంతో ఆయన స్వస్థలంలో విషాద ఛాయలు అలముకున్నాయి.
 
మరోవైపు, ఏపీలో కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతోంది. గత 24 గంటల్లో 8,835 కొత్త కేసులు నమోదయ్యాయి. ఉభయ గోదావరి జిల్లాల్లో వెయ్యికి పైగా కేసులు నమోదయ్యాయి. తూర్పు గోదావరి జిల్లాలో 1,421, పశ్చిమ గోదావరి జిల్లాలో 1,051 కేసులను గుర్తించారు. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 5,92,760కి చేరింది.