గురువారం, 28 మార్చి 2024
  1. వార్తలు
  2. కెరీర్
  3. కెరీర్ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 7 సెప్టెంబరు 2020 (08:45 IST)

ఎస్వీయూలో 26 నుంచి పీజీ నాలుగో సెమిస్టర్ పరీక్షలు

తిరుపతిలోని శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయం పరిధిలోని అన్ని డిగ్రీ కాలేజీల్లో నాలుగో సెమిస్టర్ పరీక్షలు ఈ నెల 26వ తేదీ నుంచి జరుగనున్నాయి. ఈ పరీక్షలు అక్టోబరు ఆరో తేదీ వరకు నిర్వహిస్తారు. ఉదయం 9 నుంచి 12 గంటల వరకు జరిగే పరీక్షలను విద్యార్థులు ప్రస్తుతం నివాసమున్న జిల్లాల్లోనే నిర్వహించనున్నారు.
 
కరోనా ఎఫెక్ట్‌తో వర్సిటీ యంత్రాంగం ఆ మేరకు చర్యలు చేపట్టింది. ఇందుకు అనుగుణంగా చిత్తూరు, అనంతపురం, కడప, కర్నూలు, నెల్లూరు జిల్లాల్లో పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. జిల్లాలో మొత్తం 11 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు వర్సిటీ సీఈ దామ్లా నాయక్‌ తెలిపారు.
 
కాగా, పీజీ కోర్సుకు సంబంధించి ప్రతి సెమిస్టర్‌కు రెండు ఇంటర్నల్‌ పరీక్షలు నిర్వహించి 20 వంతున మార్కులు కేటాయిస్తారు. డిస్క్రిప్టివ్ పద్ధతిన ఈ పరీక్ష జరుగుతుంది. దీంతో సెమిస్టర్‌ పరీక్షలను 80 మార్కులకు నిర్వహిస్తారు.
 
ఈ పరీక్షల్లో వచ్చే మార్కులకు ఇంటర్నల్‌ మార్కులను కలిపి ఫలితాలను వెల్లడిస్తారు. కరోనా విజృంభణ దృష్ట్యా ఒక్క ఇంటర్నల్‌ పరీక్ష పూర్తికాగా, రెండో పరీక్ష రద్దయింది. ఆ మేరకు.. ప్రస్తుతం నిర్వహించిన మొదటి ఇంటర్నల్‌ పరీక్షలో వచ్చిన మార్కుల ఆధారంగానే రెండో పరీక్షకు మార్కులు కేటాయించనున్నారు. ఈ పరీక్షల నిర్వహణ కోసం అన్ని ఏర్పాట్లు చేశారు.