శుక్రవారం, 29 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By సెల్వి
Last Updated : బుధవారం, 4 జనవరి 2023 (23:08 IST)

అలా కనిపించకూడదు.. అభివాదం చేయకూడదు.. ఈ చీకటి ఉత్తర్వులేంటి?

pawan kalyan
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ క్రియాశీలక రాజకీయాల్లో దిగారు. వచ్చే ఎన్నికలను లక్ష్యంగా చేసుకుని అధికారంలో వున్న వైకాపా సర్కారుపై తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. ఏపీ సర్కారులోని లోపాలను ఎండగడుతున్నారు. తాజాగా రోడ్ షోలు, బహిరంగ సభల ప్రజలు అత్యధికంగా సంచరించే ప్రాంతాల్లో నిర్వహించకూడదంటూ బంద్ చేయడంపై పవర్ స్టార్ ఫైర్ అయ్యారు. ప్రతిపక్షాల గొంతు నొక్కేందుకే జీవో 1 తీసుకొచ్చారని జనసేనాని మండిపడ్డారు.
 
ప్రతిపక్ష పార్టీలు ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తే పాలక పార్టీ లోపాలు తెలిసిపోతాయనే ఉద్దేశంతో జీవో 1 తెచ్చారని పవన్ విమర్శించారు. తాజాగా ఓ ప్రకటనలో వైకాపా సర్కారుపై విమర్శలు గుప్పించారు. ప్రజా వ్యతిరేక విధానాలను పాలకులు అమలు చేస్తుంటే ప్రజాపక్షం వహించడం ప్రతిపక్ష పార్టీలుగా తమ బాధ్యత అన్నారు. 
 
ఇలాంటి చీకటి ఉత్తర్వులు ఇవ్వకుండానే అందులోనే దురుద్దేశాలను విశాఖలో అక్టోబరులో వెల్లడించారని పవన్ ఎత్తిచూపారు. వాహనంలోంచి కనిపించకూడదు. ప్రజలకు అభివాదం చేయకూడదు. హోటల్ నుంచి బయటికి రాకూడదంటూ నిర్భంధాలు విధించారని పవన్ ప్రకటనలో గుర్తు చేశారు. జీవో ఉత్తర్వులతో తెలుగుదేశం అధినేత చంద్రబాబు కుప్పం పర్యటనను అడ్డుకున్నారని చెప్పుకొచ్చారు. 
 
ఈ చర్యలు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసేలా వున్నాయని.. ప్రభుత్వ వైఖరిని తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పుకొచ్చారు. చంద్రబాబు ఓ ఎమ్మెల్యేగా తన నియోజకవర్గంలో పర్యటించి ప్రజలను కలవడం ఆయన బాధ్యత. ఆయన విధులను, బాధ్యతలను జీవో 1 ద్వారా అడ్డుకుంటారా అంటూ నిలదీశారు. ఈ ఉత్తర్వులు సీఎం జగన్‌కు వర్తిస్తాయా అంటూ ప్రశ్నించారు. దీనిపై వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు.