గురువారం, 19 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 19 జులై 2022 (20:06 IST)

రైలు ప్రయాణికులకు శుభవార్త... టీపై సర్వీసు చార్జి ఎత్తివేత.. కానీ...

irctc
రైలు ప్రయాణికులకు రైల్వే శాఖ శుభవార్త చెప్పింది. అదేసమయంలో మరో బ్యాడ్ న్యూస్ కూడా చెప్పింది. రాజధాని, శతాబ్ది, దురంతో, వందే భారత్ వంటి ప్రీమియం రైళ్లలో కప్పు టీకి వసూలు చేసే సర్వీస్ చార్జీని రద్దు చేసింది. ఈ రైళ్లలో ఒక కప్పు టీ రూ.20 కాగా, దీనికి వసూలు చేసే సర్వీస్ చార్జి రూ.50గా వుంది. ఇది సోషల్ మీడియాలో పెద్ద వైరల్ అయింది. దీంతో ఐఆర్‌టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. 
 
అన్ని రకాల ప్రీమియం రైళ్లలో టీ, కాఫీలపై సర్వీసు ఛార్జీని రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో టికెట్‌తో పాటు బుక్‌ చేసుకోకపోయినా.. ఇకపై టీ, కాఫీకి ఎటువంటి సర్వీసు ఛార్జీ, కన్వీనియెన్స్‌ ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. కానీ, చిరుతిళ్లు, భోజనంపై మాత్రం రూ.50 సర్వీసు ఛార్జీని యథావిధిగా కొనసాగించారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం ఐఆర్‌సీటీసీకి ఆదేశాలు జారీ చేసింది.
 
రెండువారాల క్రితం ఓ రైలు ప్రయాణికుడు తాను కప్పు టీ కోసం ఏకంగా రూ.70 వెచ్చించినట్లు సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు. ఇందులో కప్‌ టీ ధర రూ.20 మాత్రమే. దీనికి సర్వీస్‌ ఛార్జీ రూ.50 చెల్లించాల్సి వచ్చింది. అతడు చేసిన ట్వీట్‌ వైరల్‌గా మారడంతో నెటిజన్లు ఐఆర్‌సీటీసీ తీరుపై అసహనం వ్యక్తం చేశారు.